గొర్రెల పంపిణీ కాదు..చట్టసభలో ప్రాతినిధ్యం కావాలి

గొర్రెల పంపిణీ కాదు..చట్టసభలో ప్రాతినిధ్యం కావాలి

తెలంగాణ రాష్ట్ర జనాభాలో10 శాతానికి పైగా ఉన్న కురుమలు.. అక్షరాస్యతకు నోచుకోక, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగుస్థాయిలో ఉన్నారు. కురుమల్లో అనైక్యత, చైతన్యం లేకపోవడంతో ఇన్నాళ్లు రాజకీయంగా ఎదగలేదు. గొర్రెల, మేకల కాపరుల కష్టాలు, వారికి ఏండ్లుగా జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో ప్రశ్నించే వారే లేరు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించలేదు. అధికార పార్టీ కనీసం ఒక్క సీటు కూడా శాసనసభలో కేటాయించకుండా, ఎమ్మెల్సీ బిచ్చం వేయడం కురుమల ఆత్మగౌరవానికి విఘాతం. నిజాం రోజుల కన్నా ప్రజాస్వామ్యంలో కురుమల పరిస్థితి దారుణంగా మారింది.

గతంలో అడవిలో పశువులను మేపుకునే హక్కు ఉండేది. గ్రామకంఠంలో 30 శాతం భూమి పశువుల మేతకు ఉంటే అది కూడా పోయింది. కొండలు, గుట్టలు కొట్టేసి గ్రానైట్ మాఫీయా పసులకు మేత లేకుండా చేశారు. రోడ్డు పక్కన బోనులోపల మొక్క ఉంటే దాని ఆకు మేసిందని గొర్రెలు, మేకలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితిల్లో గొర్రెలు ఎక్కడ మేత మేయాలో కూడా తెలియని పరిస్థితి.

అడపాదడపా గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. వాటి మేత గురించి ఆలోచించడం లేదు. ఇలా కురుమలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా.. వీళ్ల సమస్యలు పరిష్కరించే రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. అందుకే జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కోసం కొట్లాడాలి. అందుకోసం కురుమలు చైతన్యవంతంగా ఆలోచించి, సమైక్యంగా అడుగులు వేయాలి. అవసరమైతే ఇండిపెండెంట్ గా నామినేషన్లు వేయాలి. పార్టీలతో సంబంధం లేకుండా కురుమలు ఎక్కడ నిలబడ్డా మద్దతు తెలపాలి. 

- దొడ్డి చంద్రం కురుమ
కడవెండి, జనగామ జిల్లా