బండి సంజయ్ రేవంత్‌కు కోవర్టు : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

బండి సంజయ్ రేవంత్‌కు కోవర్టు : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నింటిని అటకెక్కించిందని కుత్బుల్లాపూర్‌‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులను నిండా ముంచిందని ఆరోపించారు. నిరుద్యోగులు పోరాడుతున్నా బీజేపీ నాయకులు మద్దతు ఇవ్వరని..ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.బండి సంజయ్.సీఎం రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో సోదరుడి కంపెనీతో రేవంత్‌‌ అగ్రిమెంట్ చేసుకుంటే బండి సంజయ్ ఆ ఒప్పందాన్ని సమర్థించారని తెలిపారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు.  ఐటీ సెక్టార్‌‌లో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. 

ఇప్పుడు కాంగ్రెస్​ పాలనలో అమరరాజా కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతామని చెప్తోందని.. ఉన్న పెట్టుబడులు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని సూచించారు. ఇక ఈ నెల 2వ తేదీన సుంకిశాల ప్రమాదం జరిగి.. అది  సోషల్ మీడియాలో వస్తే కానీ ప్రభుత్వానికి తెలియలేదన్నారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందని ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు.