కువైట్ ఫైర్ యాక్సిడెంట్‌ మృతుల్లో తెలుగువారు

కువైట్ ఫైర్ యాక్సిడెంట్‌ మృతుల్లో తెలుగువారు

కువైట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో 45మంది భారతీయు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు తెలుగు వారు కాగా 24 మంది కేరళవాసులు, ఏడుగురు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. మిగిలిన వారు ఉత్తరాదికి చెందిన వారిగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం(31) అక్కడే ఎన్బిటిసి సంస్థలో రోలింగ్ ఆపరేటర్ హెల్పర్‌గా పని చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లికి చెందిన సత్యనారాయణ(45), అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు (45) డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు. 

మృతుల వివరాలను ఏపీ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో చనిపోయిన ఇండియన్స్ మృతదేహాలు ప్రత్యేక విమానంలో భారత్ కు తరలిస్తున్నారు. శుక్రవారం (ఈరోజు) మధ్యాహాన్నానికి మృతుల డెడ్ బాడీలు ఢిల్లీకి చేరుతాయి. ఏపీ వలస కార్మికుల మృతదేహాలు ఢిల్లీలోని ఆంధ్ర భవన్ కు చేరుకుంటాయి. అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొమ్మగూడెం గ్రామానికి చెందిన కే గంగయ్యతోపాటు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కూడా ప్రమాదం జరిగిన భవనంలోనే ఉన్నారు. బిల్డింగ్ నుంచి దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగగానే వీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మెట్లపై మాడిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో భవనంపై నుంచి దూకేశారు. కేబుల్ వైర్ల సాయంతో రెండో అంతస్తు నుంచి దూకినట్లు గంగయ్య తెలియజేశారు.