- కార్మిక చట్టాలు అమలై ఏడాది పూర్తయినందున కార్యక్రమం
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22న గుజరాత్ గాంధీ నగర్ లోని మహాత్మా మందిర్ లో చింతన్ శిబిరం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 29 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖ మంత్రులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 21, 2025 న కార్మిక చట్టాల అమలు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్ల తెలిపింది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించనున్నారు. ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ చింతన్ శిబిర్ కు నోయిడాలోని వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్ స్టిట్యూట్, గాంధీ నగర్ లోని గుజరాత్ నేషనల్ లా వర్సిటీ భాగస్వాములుగా సహకరించనున్నాయి. తొలి రోజు కార్మిక చట్టాలను అమలు చేసే వ్యూహాలు, ఎంఎస్ఎంఈలతో సమన్వయం, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, విశ్వాసం ఆధారిత ఎలక్ట్రానిక్ కంప్లయన్స్ వ్యవస్థలపై చర్చించనున్నారు.
