ఆధార్ లేదు.. అడ్రస్ లేదు .. బర్త్ సర్టిఫికెట్లు లేక ఆధార్ కార్డులు పొందలేకపోతున్న సంచార జాతి చిన్నారులు

ఆధార్ లేదు.. అడ్రస్ లేదు .. బర్త్ సర్టిఫికెట్లు లేక ఆధార్ కార్డులు పొందలేకపోతున్న సంచార జాతి చిన్నారులు
  • స్కూల్ లో అడ్మిషన్లకూ తిప్పలే 
  •  బడికి దూరంగా పెద్ద అంబాలి కులస్తుల పిల్లలు

కరీంనగర్, వెలుగు: ప్రస్తుత రోజుల్లో సిమ్ కార్డు నుంచి స్కూల్ అడ్మిషన్ వరకు ఏది పొందాలన్నా అన్నింటికీ ఆధార్ కార్డే ఆధారం. కానీ అదే ఆధార్ కార్డు లేక.. తమకంటూ ఓ ఇంటి అడ్రస్ లేక కరీంనగర్ శివారు ఆరేపల్లి సమీపంలోని  సంచార జాతికి చెందిన చిన్నారులు బడికి దూరమవుతున్నారు. ఎలాగోలా వారిని స్థానిక గవర్నమెంట్ స్కూల్ టీచర్లు బడిబాట పట్టించినా.. ఆధార్ కార్డుల్లేక  వివరాల నమోదులో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది పిల్లలు గుడిసెలకే పరిమితమవుతున్నారు. ఇలా ఆధార్ కార్డుల్లేని పిల్లలు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో సుమారు 100 మంది వరకు ఉంటారని అంచనా.  వీరందరికి ఆధార్ కార్డులు మంజూరు చేస్తేనే స్కూల్ లో అడ్మిషన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలకు అర్హులయ్యే పరిస్థితి కనిపిస్తోంది.   

ఇంటి వద్ద కాన్పులతో అందని బర్త్ సర్టిఫికెట్లు.. 

డప్పు వాయిస్తూ, చెర్నోకోల్ తో ఒంటిపై కొట్టుకుంటూ ప్రజలను యాచించే పెద్దఅంబాలి కులానికి చెందిన సుమారు 200 కుటుంబాలు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంచార జీవనం సాగిస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తారు. అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైతే మరో చోటికి వెళ్లిపోతుంటారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మూడు, నాలుగు దశాబ్దాలుగా ఉంటున్న వీరు.. ఎక్కువ ఇంటి వద్ద డెలివరీ కావడం, వీరు స్థానిక అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల వద్ద నమోదు చేయించుకోకపోవడంతో వీళ్ల పిల్లల జననాలు ఎక్కడా నమోదు కావడం లేదు. 

తప్పనిసరి పరిస్థితిలో హాస్పిటళ్లలో  డెలీవరీ అయినా.. అందుకు సంబంధించిన కాగితాలు దాచుకునే, డేట్లు గుర్తుంచుకునే అవగాహన కూడా వీరికి లేదు. దీంతో ఈ పిల్లల పేరిట బర్త్ సర్టిఫికెట్లు పొందడం ఇబ్బందికరంగా మారింది. 

అధికారులు ప్రత్యేక దృష్టిపెడితేనే  పరిష్కారం.. 

ఆరెపల్లిలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లను ఈ విషయమై వివరణ కోరగా.. తాము రోజూ 8 గంటలకే ఆ బస్తీకి వెళ్లి పిల్లలను వెంటపడి స్కూల్ కు వచ్చేలా చేస్తున్నామని చెప్తున్నారు. తల్లిదండ్రులు పనుల మీద ఉదయాన్నే బయటికి వెళ్తుండడంతో ఇదే అదనుగా కొందరు పిల్లలు డుమ్మా కొడుతున్నారని చెబుతున్నారు. కలెక్టర్, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పిల్లలకు ఆధార్ కార్డులు వచ్చేలా చేయడంతోపాటు స్కూల్ కు పంపించేలా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని టీచర్లు అభిప్రాయపడ్డారు. 

బడికి పంపమంటున్నరు.. కానీ పుస్తకాలు, బట్టలు ఇయ్యట్లేదు 

నాకు 8 మంది పిల్లలు. వీళ్లలో ఇద్దరు పిల్లలకు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆరుగురికి లేదు. నా భర్త ఏడు నెలల క్రితం చనిపోయిండు.  నా పిల్లలను బడికి తోలమని మేడం వచ్చి చెప్పడంతో పంపుతున్నా.  ఆధార్ కార్డు లేదని చెప్పి పుస్తకాలు, బట్టలు ఇయ్యట్లేదు.  ఆధార్ లేదా పుట్టిన సర్టిఫికెట్ పట్టుకురమ్మని టీచర్ చెప్పింది. గుడిసె దగ్గర్నే కాన్పయిందని, అసొంటి కాగితాలేవీ లేవని మా దగ్గర లేవని చెప్పిన. బడిలో ఆధార్ కార్డు ఉన్నోళ్లకే  పుస్తకాలు, బట్టలు ఇవ్వడంతో పిల్లలు పుస్తకాలు లేనిది బడికి పోమని ఇంటి దగ్గరే ఉంటున్నరు.

కోట కలవ్వ, సంచార జాతి మహిళ