చైనాకు మళ్లీ పొంచి ఉన్న కరోనా ముప్పు?

చైనాకు మళ్లీ పొంచి ఉన్న కరోనా ముప్పు?
  • హెచ్చరించిన ప్రముఖ హెల్త్ ఎక్స్ ఫర్ట్ డాక్టర్ జాంగ్ నాన్ షాన్

బీజింగ్ : కరోనా వైరస్ పుట్టిన చైనా ఇంకా ఆ ముప్పు నుంచి బయటపడలేదా ? దాదాపుగా ఈ వైరస్ అదుపులోకి వచ్చిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించినా అసలు ప్రమాదమంతా ముందుందా? డ్రాగన్ కంట్రీకి మరోసారి కరోనా ఎఫెక్ట్ గట్టిగా తగలనుందా? అంటే అవుననే చెబుతున్నారు చైనాలోని ప్రముఖ హెల్త్ ఎక్స్ ఫర్ట్ డాక్టర్ జాంగ్ నాన్ షాన్. 2003 లో చైనాలో సార్స్ ను ఎదుర్కోవటంలో జోంగ్ కీలక పాత్ర పోషించారు. అందుకే చైనాలో ఆయనను సార్స్ హీరో అని పిలుస్తారు. ప్రస్తుతం కరోనా నివారణలో కూడా ఆయన కీలకంగా వ్యవహారిస్తున్నారు. అలాంటి డాక్టర్ జాంగ్ నాన్ షాన్ కరోనా ప్రమాదం చైనాకు ముందు ముందుందని చెబుతున్నారు. ఓ ఇంటర్నేషనల్ న్యూస్ సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. చైనీయులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని…ఇది భవిష్యత్ లో పెద్ద సమస్యగా మారుతుందని చెప్పారు. కరోనా ముప్పు చైనాకు రెండో దశలో పెను సవాల్ గా మారనుందన్నారు. చాలా మంది దీని బారిన పడనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాలతో పోలిస్తే చైనాయే ఎక్కువగా కరోనా కారణంగా ఎఫెక్ట్ అవుతుందన్నారు. ప్రస్తుతం కరోనాను అదుపు చేశామన్న భావనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించవద్దని మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా తీవ్రత మొదట్లో చైనాలోని అధికారులు తక్కువ చేసి చూపారని స్పష్టంగా చెప్పారు. పెను సవాల్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉందని డాక్టర్ జాంగ్ నాన్ షాన్ చెప్పారు. మొదట్లో చైనా లో భారీగా కేసులు నమోదైనప్పటికీ రెండు వారాల క్రితం నాటికి దాదాపు కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో వుహాన్ లో లాక్ డౌన్ ను ఎత్తి వేశారు. కానీ మళ్లీ కొత్త కేసులు మొదలయ్యాయి.