చైనాలో కండోమ్స్ పై 13% ట్యాక్స్.. బర్త్ రేట్ తగ్గిపోవడంతో ప్రభుత్వ నిర్ణయం

చైనాలో కండోమ్స్ పై 13% ట్యాక్స్.. బర్త్ రేట్ తగ్గిపోవడంతో ప్రభుత్వ నిర్ణయం
  • మూడు దశాబ్దాల తర్వాత పన్ను విధింపు.. 
  • నూతన సంవత్సరం నుంచి అమల్లోకి 
  • సర్కారు చర్యను వ్యతిరేకిస్తున్న యువత

బీజింగ్: జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా బర్త్ రేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కండోమ్‌‌ సహా ఔషధాలు, గర్భ నిరోధక సాధనాలపై 13% వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) విధించింది. మూడు దశాబ్దాలుగా ఆ దేశంలో వీటికి పన్ను మినహాయింపు ఉంది. అయితే, గురువారం నుంచి మాత్రం వీటిపై పన్ను మినహాయింపు ఉండదు. 

చైనాలో వృద్ధ జనాభా భారీగా పెరుగుతుండటం, జననాల రేటు తగ్గిపోతుండటంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరం నుంచి  ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వ చర్యను ఆ దేశ పౌరులు ముఖ్యంగా యువత తీవ్రంగా విమర్శిస్తున్నారు. పెండ్లి చేసుకుని పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం గర్భనిరోధకాలపై పన్ను వేయడం ఏంటని మండిపడుతున్నారు. 

వన్ చైల్డ్ పాలసీతో తగ్గిన జననాలు.. 

చైనాలో 1993లో వ్యాట్ ప్రవేశపెట్టారు. డ్రాగన్ ఆ సమయంలో వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసేది. దీంతో ఉద్దేశపూర్వకంగానే కండోమ్స్, గర్భనిరోధక సాధనాలపై ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది.  ఆ నిర్ణయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహిళలకు బలవంతంగా గర్భస్రావాలు చేయించేవారు. ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే ఒకరికి మాత్రమే ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేసేది. మిగిలిన వారికి ఇచ్చేది కాదు. దీంతో ఆ పిల్లలు ప్రాథమిక హక్కులకు దూరమయ్యేవారు. 

ప్రభుత్వం ప్రోత్సహించినా పెరగని బర్త్ రేట్ 

చైనా ప్రస్తుతం అందుకు విరుద్ధమైన సమస్యను ఎదుర్కొంటోంది. జననాలు భారీగా తగ్గిపోయాయి. వరుసగా మూడేండ్లు మరణాలు జననాలను మించిపోయాయి. ఇండియా 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2015లో వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది.

 2021లో ముగ్గురు పిల్లల వరకు కనొచ్చని పేర్కొంది. దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి నగదు ప్రోత్సాహకాలు, పన్ను ప్రయోజనాలు, సబ్సిడీలు, తల్లిదండ్రుల సెలవులను ఎక్కువగా అందించింది.  అయినప్పటికీ, బర్త్ రేట్ తగ్గుతూనే ఉంది.  

ప్రభుత్వ నిర్ణయ ప్రభావం నామమాత్రమే 

చైనాలో కండోమ్​లు సాధారణంగా 40 నుంచి 60 యువాన్ల వరకు లభిస్తాయి. గర్భ నిరోధక మాత్రల ధర 50 నుంచి 130 యువాన్ల వరకు ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏడాదికి 5 బిలియన్ యువాన్ల రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఈ మొత్తం చైనా బడ్జెట్ లో 22 ట్రిలియన్ యువాన్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే చాలా మంది నిపుణులు సర్కారు నిర్ణయంతో నామమాత్రపు ప్రభావం మాత్రమే ఉంటుందని పేర్కొంటున్నారు.