అమెరికా, ఇరాన్ మధ్య మరో 60 రోజుల సీజ్ ఫైర్! తాత్కాలిక డీల్ కుదిరింది: జేడీ వాన్స్

అమెరికా, ఇరాన్  మధ్య  మరో 60 రోజుల సీజ్ ఫైర్! తాత్కాలిక డీల్ కుదిరింది: జేడీ వాన్స్
  • ట్రంప్ ఆమోదమే మిగిలిందని వెల్లడి 

వాషింగ్టన్: మూడు నెలలుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడనుంది. కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్తగా చర్చలు జరిపేందుకు ఇరు దేశాల ప్రతినిధులు తాత్కాలిక ఒప్పందానికి వచ్చారు. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గురువారం రాత్రి ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. అయితే, దీనికి ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలుపుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని పేర్కొన్నారు.

 ‘‘ఈ ఒప్పందంపై ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడు సంతకం చేస్తారు. అసలు చేస్తారా లేదా అని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. కొన్ని సాంకేతిక అంశాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి’’ అని వాన్స్ తెలిపారు. ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదు. అంతేకాకుండా, ఆ మార్గంలో అమర్చిన మైన్‌‌‌‌‌‌‌‌లను 30 రోజుల్లోగా ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది. అయితే, 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల గురించి ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది. 

తుది నిర్ణయం తీసుకుంటున్నా: ట్రంప్ 

ఇరాన్‌‌‌‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా? వద్దా? అనే దానిపై తాను తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. "తుది నిర్ణయం తీసుకోవడానికి నేను ఇప్పుడు సిచ్యుయేషన్ రూమ్‌‌‌‌లో సమావేశం కాబోతున్నాను" అని ట్రంప్ ఒక సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌లో పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను ఎప్పటికీ కలిగి ఉండకూడదని, హార్మూజ్ షిప్పింగ్ మార్గాలను తెరవడానికి అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. 

ఇరాన్ జలసంధిలోని మైన్లను వెంటనే తొలగించడాన్ని పూర్తి చేస్తుందని, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిస్తామని ట్రంప్ చెప్పారు. దీనివల్ల చమురు, ఇతర ట్యాంకర్ల రాకపోకలు ప్రారంభమవుతాయన్నారు. ‘‘నావికులు ఇక మీ భార్యలకు హలో చెప్పండి. హార్మూజ్ లో నౌకల రాకపోకలు స్టార్ట్ అవుతున్నాయి” అని పేర్కొన్నారు. అయితే, ఇందుకు ఇరాన్ అంగీకరించిందా లేదా ట్రంప్ తన నిర్ణయం తీసుకోకముందే అమెరికా దిగ్బంధనం నిజంగానే తొలగించిందా? అనేది 
తెలియలేదు.

  • జెట్ కూల్చామన్న ఇరాన్.. ఖండించిన యూఎస్ 

ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని బుషెహర్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌  జామ్ ప్రాంతంలో  శుక్రవారం తెల్లవారుజామున అమెరికా విమానాన్ని తమ బలగాలు కూల్చివేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే, ఈ వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. అమెరికా వైమానిక ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.