చైనా మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు పేరుతో పైకి నాటకాలాడుతూ, ఇండియాపై నోటికొచ్చినట్లు వివాదాస్పద కామెంట్లు చేస్తోంది. లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని అక్రమంగా ఏర్పాటు చేసిందంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్ వింత స్టేట్మెంట్ ఇచ్చారు. లఢఖ్, అరుణాచల్‌ప్రదేశ్‌లను తాము భారత్‌లో భాగంగా చూడడం లేదని అన్నారు. లఢఖ్‌లో సోమవారం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఢఖ్ సరిహద్దు ప్రాంతంలో 44 బ్రిడ్జిలను ప్రారంభించిన నేపథ్యంలో చైనా ఇవాళ ఈ స్టేట్మెంట్ వెల్లడించింది. లఢఖ్‌లో భారత్ రోడ్లు, బ్రిడ్జ్‌ల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులను చేపట్టడాన్ని ఖండిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియాన్ అన్నారు. ‘‘లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని భారత్ చట్ట వ్యతిరేకంగా, అక్రమంగా ఏర్పాటు చేసింది. లఢఖ్ యూనియన్ టెరిటరీని, అరుణాచల్‌ప్రదేశ్‌లను చైనా గుర్తించడం లేదని స్పష్టం చేస్తున్నా. బోర్డర్ ఏరియాలో మిలటరీని మోహరించే లక్ష్యంతో ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. రెండు దేశాలు ఏకాభిప్రాయంతో ఎటువంటి ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్ని టెన్షస్ సద్దుమణిగేలా ప్రయత్నం చేయాలి’’ అని అన్నారు. ఎల్ఏసీ వెంట భారత్ రోడ్లు, బ్రిడ్జ్‌లు వంటి పనుల్లో స్పీడ్ పెంచడమే రెండు దేశాల మధ్య వివాదాలకు కారణమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. కొన్నాళ్లుగా ఇండియా సరిహద్దుల్లో మౌలిక వసతుల పనులు వేగంగా చేపట్టడంతో పాటు సైనిక బలగాల మోహరింపు ఎక్కువవుతోందని, దీని వల్లే బోర్డర్‌లో ఉద్రిక్తతలు పెరుడుతున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు రెండు దేశాలు ఏకాభిప్రాయంతో టెన్షన్స్ తగ్గించేందుకు కృషి చేయాలని అన్నారు.
