
హైదరాబాద్ / ఎల్బీ నగర్, వెలుగు : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా ఆర్టీసీలో అత్యాధునిక వసతులతో లహరి అమ్మ ఒడి బస్సులను తీసుకొచ్చామని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ తెలిపారు. సోమవారం ఎల్బీ నగర్ లో తొమ్మిది ఏసీ లహరి బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు మేనేజ్ మెంట్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి అన్నారు. సదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలతో లహరి బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ బస్సులు, త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.
చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో బస్ ట్రాకింగ్, ఫ్రీ వైఫై, ప్యానిక్ బటన్ తదితర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాలైన బెంగళూరు, చెన్నై, తిరుపతి, వైజాగ్, హుబ్లి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ బస్సులను తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, ఎల్ బీ నగర్ లో ప్యాసింజర్లకు బస్ షెల్టర్, టాయిలెట్స్ లేవని, ఎండ, వానాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ పంకజను మంత్రి ఆదేశించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో మాట్లాడుతానని అజయ్ హామీ ఇచ్చారు.కాగా, త్వరలోనే ఆర్టీసీ యాక్సిడెంట్ ఫ్రీ కార్పొరేషన్‌గా మారబోతోందని ఎండీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం జేబీఎస్ లో ఏప్రిల్ చాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టాక్ట్) ను ప్రారంభించారు. వచ్చే నెలలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, తదితర విభాగాల సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు.