ఢిల్లీలో లక్ష మొక్కలు నాటుతం

ఢిల్లీలో లక్ష మొక్కలు నాటుతం

న్యూఢిల్లీ, వెలుగు: నాలుగేండ్ల కింద ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి ఫలితాలు సాధిస్తూ, పచ్చదనం పెంపు దిశగా ముందుకు సాగుతోందని ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌‌‌‌ అన్నారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో దేశ ప్రజల్లో హరిత స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని  చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సహకారంతో ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలెంజ్‌‌‌‌గా తీసుకున్నామన్నారు. ఈ మేరకు బుధవారం నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్‌‌‌‌లో వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మియావాకీ పద్దతిలో పార్క్ ఖాళీ స్థలంలో వెయ్యి మొక్కలు నాటి, మినీ ఫారెస్ట్‌‌‌‌ను గ్రీన్ ఇండియా చాలెంజ్ డెవలప్‌‌‌‌ చేయనుంది. ఎంపీ సంతోశ్‌‌‌‌ తీసుకున్న చాలెంజ్‌‌‌‌ అందరికీ ఆదర్శవంతమైనదని వైఎస్ఆర్‌‌‌‌‌‌‌‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభినందించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ కార్యక్రమం సక్సెస్‌‌‌‌ కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్‌‌‌‌ ఆకాంక్షించారు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అత్యంత అవసరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఒక పార్కు ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రామ్ కీ సంస్థ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.