ప్రదోష కాల సమయంలో నిర్వహించే లక్ష్మీ పూజ

ప్రదోష కాల సమయంలో నిర్వహించే లక్ష్మీ పూజ

చెడుపై మంచి, చీకటిపై వెలుగు, నిరాశపై సంతోషం సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ రోజును దేశ వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటాయి. ఈ వేడుక దినాన ప్రజలు ఆచారాలను పాటిస్తారు. వారి ఇళ్లను శుభ్రం చేసుకొని, దీపాలు, ముగ్గులు, పువ్వులతో అలంకరిస్తారు. దాంతో పాటు రుచికరమైన స్వీట్లను, భోజనాలను ఆస్వాదిస్తారు. కొత్త సంప్రదాయ దుస్తులను ధరిస్తారు.

ఇక ఈ దీపావళి రోజు అత్యంత ముఖ్యంగా భావించేది పూజా కార్యక్రమం. అందులో భాగంగా ముఖ్యంగా లక్ష్మీదేవి, గణేశుని ఆశీర్వాదాలు తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. భయాలను జయించే ధైర్యాన్ని ఇచ్చేందుకు, సరైన మార్గం వైపు నడిపేందుకు ప్రజలు తమ ఇళ్లల్లో పూజలు చేస్తూ దైవాన్ని భక్తితో కొలుస్తారు.

సాధారణంగా దీపావళి లక్ష్మీ- గణేశ్ పూజ చేయడంతో ప్రారంభమవుతుంది. దానికి శుభ ముహూర్తం సా.6.53ని. నుండి 8.16 వరకు ఉన్నట్టు పురాణాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఏరియాను బట్టి ఈ సమయంలో తేడాలుండవచ్చు. ఇక ఎంతో భక్తితో కొలిచే లక్ష్మీదేవికి ఈ రోజు మోదక్, హల్వా, లడ్డూలు వంటి స్వీట్లను నైవేద్యంగా పెడతారు. దీపాలను వెలిగిస్తే చెడు తొలగిపోతుందనేది హిందూ ప్రజలు విశ్వసిస్తారు.

పురాణాల ప్రకారం...

14ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత  శ్రీరాముడు అడవి నుంచి అయోధ్యకు దీపావళి రోజున వచ్చాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ రోజుల లక్ష్మీ, గణేశ్, కుబేరులను భక్తితో కొలిచి చక్కని ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు ఇవ్వాలని ప్రార్థిస్తారు. కొందరు తమ పూర్వీకులను తలచుకొని, అమావాస్య నాడు శ్రాద్ధం నిర్వహిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమై రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు (సుమారుగా) ఉండే ప్రదోష కాల సమయంలో దీపావళి నాడు లక్ష్మీ పూజ నిర్వహిస్తారు.