ఎంపీ సంతోష్‌‌రావుపై భూకబ్జా కేసు

ఎంపీ సంతోష్‌‌రావుపై భూకబ్జా కేసు
  • తమ ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు
  • ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపణ
  • సంతోష్​రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్​పై పలు సెక్షన్ల కింద కేసులు
  • విచారణ ప్రారంభించిన బంజారాహిల్స్​ పోలీసులు
  • ఖండించిన ఎంపీ.. ఆ భూమిని 2016 లో కొనుక్కున్నానని వివరణ
  • తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ రావుపై భూకబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్‌‌ రోడ్ నంబర్ 14 లోని ఓ ఖరీదైన స్థలాన్ని ఆయన కబ్జా చేసేందుకు ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారని నవయుగ ఇంజినీరింగ్​ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌‌ఈసీఎల్‌‌)  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి చింత మాధవ్‌‌ మార్చి 21న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సంతోష్ రావు, లింగారెడ్డి శ్రీధర్‌‌‌‌పై కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్‌‌ రోడ్డు నంబర్ 14లోని 129/54 సర్వే నంబర్‌‌‌‌లో గల 1,350 చదరపు గజాల భూమిని 2010లో కరణ్​ దూబే, ఆయన భార్య భారతి దూబే నుంచి ఎన్‌‌ఈసీఎల్ కంపెనీ కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీకి సంబంధించి నిరుడు నవంబర్‌‌‌‌లో ఎన్‌‌కంబరెన్స్​ సర్టిఫికెట్ చెక్‌‌ చేసినప్పుడు కూడా ఎన్‌‌ఈసీఎల్‌‌ పేరిటే ఉన్నదని తెలిపారు. ఇటీవల ఆ భూమిలో రెండు రూమ్స్ నిర్మించినట్టు తెలియడంతో తాము జీహెచ్‌‌ఎంసీ ఆఫీసులో ఎంక్వైరీ చేశామని, జోగినిపల్లి సంతోష్‌‌రావు, లింగారెడ్డి శ్రీధర్‌‌‌‌ పేరిట ఆ రూమ్‌‌లకు హౌస్​ నంబర్లు ఉన్నాయని, వాళ్లే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. 

ఇందుకోసం ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్‌‌‌‌ డోర్ నంబర్లు, డాక్యుమెంట్లను తయారు చేసినట్టుగా తాము గుర్తించామన్నారు. తద్వారా తమ కంపెనీకి చెందిన 1,350 గజాల భూమిని కబ్జా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మాధవ్ పేర్కొన్నారు. కబ్జాకు యత్నిస్తున్న సంతోష్‌‌‌‌రావు, లింగారెడ్డి శ్రీధర్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇరువురిపై బంజారాహిల్స్ పోలీసులు సెక్షన్లు 420,468,471,447,120(బీ),ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

కబ్జా చేయలేదు.. బాజాప్తా కొనుక్కున్నా: సంతోష్​రావు

తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేత, ఎంపీ జోగినపల్లి సంతోష్‌‌‌‌రావు ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని  శ్యాంసుందర్ ఫుల్జాల్ అనే వ్యక్తి నుంచి బాజాప్తా కొనుగోలు చేశానని, కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. 1998లో ఆ భూమిని శ్యాంసుందర్ కొనుగోలు చేశాడని, అప్పటి నుంచి ఇప్పటివరకూ భూమిపై వివాదాలేవీ లేవన్నారు.

2016లో రూ.3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి సేల్ డీడ్ ద్వారా భూమి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని సంతోష్​రావు వివరించారు. తాను ఎలాంటి ఫోర్జరీలు చేయలేదని చెప్పారు. తాను కొన్న తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. తనకు భూమి అమ్మిన శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు.  ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇవ్వాలని, వివరణ అడగాలని, కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్​లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారని తెలిపారు.

వివాదాస్పద ఇంటి స్థలం1,350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారని, అది 904 గజాలు మాత్రమేనని సంతోష్ రావు పేర్కొన్నారు. డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ భూమిపై అన్నిరకాల విచారణలు చేసుకోవచ్చునని, తనకేమీ అభ్యంతరం లేదన్నారు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ‘‘32 ఏండ్లుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడు ఎందుకు తెర మీదికి వచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మా పార్టీపై, నాపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా’  అని సంతోష్‌‌‌‌రావు హెచ్చరించారు.