కేసీఆర్​ అన్న కొడుకు.. కన్నారావుపై భూ కబ్జా కేసు

కేసీఆర్​ అన్న కొడుకు.. కన్నారావుపై భూ కబ్జా కేసు
  • 38 మంది బీఆర్​ఎస్​ నేతలపై కూడా..!
  • పోలీసుల అదుపులో ఐదుగురు.. పరారీలో కన్నారావు, మిగతావాళ్లు
  • 150 మంది దుండగులు, జేసీబీతో 
  • వచ్చి 2 ఎకరాల ల్యాండ్​ కబ్జాకు ప్రయత్నించారని బాధితుడి ఫిర్యాదు
  • గుడిసెకు నిప్పుపెట్టి, ల్యాండ్​ టేకర్స్​పై దాడి చేశారని ఆవేదన
  • అటెంప్ట్​ టు మర్డర్​ కేసు కూడా ఫైల్​ చేసిన పోలీసులు
  • బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు.. త్వరలో అరెస్ట్​

ఎల్బీ నగర్, వెలుగు: బీఆర్​ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్​అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​ కన్నారావుపై రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్​స్టేషన్​లో అటెంప్ట్  టు మర్డర్​, భూ కబ్జా కేసు లు నమోదయ్యాయి. కన్నారావుతో పాటు ఆయన అనుచరులు, పలువురు బీఆర్​ఎస్ నాయకులపై కూడా ఈ కేసులు ఫైల్​ అయ్యాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్  మండలం మన్నెగూడ  సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కన్నారావు ఈ నెల 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​ పేర్కొన్నారు.

అదేవిధంగా ఆ భూమిలోని గుడిసెకు నిప్పు పెట్టి కాల్చారని, అక్కడ ఉన్న ల్యాండ్ టేకర్స్ పై దాడికి దిగారని తెలిపారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కన్నా రావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీ డ్రైవర్, ఓనర్ తో పాటు ఐదుగురిని రిమాండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితులు కన్నా రావుతో పాటు జక్కిడి సురేందర్ రెడ్డి, హరినాథ్ తదితరులు పరారీలో ఉన్నారని, వారి కోసం ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో 12 మందితో 3 టీమ్​లు గాలిస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులో కన్నారావు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. త్వరలోనే అరెస్టు చేయనున్నారు.