ల్యాండ్​ యూసేజ్ ​పాలసీ లేక మార్కెట్​ సరుకుగా మారిన భూమి

ల్యాండ్​ యూసేజ్ ​పాలసీ లేక మార్కెట్​ సరుకుగా మారిన భూమి

భూమి, నీరు, అడవులు, ఖనిజ సంపద లాంటి సహజ వనరులకు ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. జనాభా పెరుగుతున్నట్లుగా అవి పెరగవు. సహజ వనరులన్నీ కేవలం వర్తమానంలో మనుషుల అవసరాలు తీర్చడానికే ఉన్నాయన్నట్లుగా వ్యవహరించడం ఎప్పుడూ మంచిది కాదు. మొత్తం జీవావరణంలో మనుషులు ఒక భాగం మాత్రమే. ఇంకా అనేక జంతు జాతులు, చెట్లు, ప్రాణులు, జలచరాలు, సూక్ష్మ జీవులు మన చుట్టూ ఉన్నాయి. వాటి ఉనికి మానవ జాతికి ఎంత అవసరమో, ఈ సహజ వనరులన్నీ కూడా ఈ జీవావరణానికి అంతే అవసరం. మన ముందు తరాలు తమ జీవిత కాలంలో వీటిని పొదుపుగా, సుస్థిర పద్ధతుల్లో వాడటం వల్లే అవి మన వరకు మిగిలాయి. అదే పద్ధతిలో ఈ సహజ వనరులను మన తరాలు కూడా జాగ్రత్తగా వినియోగించి, తరువాత తరాలకు అప్పచెప్పడం జరగాలి.  

ప్రమాదంలో ఆహార భద్రత..

ప్రభుత్వాలు ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు, లాభాపేక్షతో పర్యావరణాన్ని ధ్వంసం చేసే కార్పొరేట్లు, పెట్టుబడి దారులు, అంతులేని వస్తు వ్యామోహంతో, వినియోగదారీ సంస్కృతికి అలవాటు పడిన మానవ సమాజం, వ్యవసాయం, పశు పోషణలో ఉపయోగిస్తున్న ఉత్పత్తి పద్ధతులు ఆధునిక యంత్రాలు, పరికరాలు, వాహనాలు సృష్టించే కాలుష్యం భూమినీ మొత్తంగా పర్యావరణాన్నీ పాడు చేస్తున్నాయి.  పంటల సాగులో విష రసాయనాల వాడకం భూమి భౌతిక, రసాయన లక్షణాలను నాశనం చేస్తున్నది. వాటి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నది. భూమి నిస్సారమై పోయి, పంట దిగుబడులు పడిపోతున్నాయి. జీవ వైవిధ్యం, పంటల వైవిధ్యం తగ్గి పోతున్నది. సింథటిక్ రసాయనాల వినియోగం వల్ల భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్య, ప్రకృతిలో తేనె టీగల సంఖ్య తగ్గుతున్నది. ఫలితంగా సగటు ఆహార ఉత్పత్తి తగ్గి, ఆహార భద్రత ప్రమాదంలో పడుతున్నది. ఇప్పటికే  పౌష్టిక ఆహార లోపం వల్ల ఆహార సూచీలోఇండియా 107వ స్థానానికి దిగజారింది.  భూమి అనేది జీవనోపాధి వనరు. కోట్లాది మంది భారత గ్రామీణ, ఆదివాసీ ప్రజలు భూమి కేంద్రంగా ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నారు. ఆహార భద్రత సమకూరుస్తున్నారు. పురాతన కట్టడాలే కాదు, మతపరమైన స్థలాలు, పర్యాటక ప్రాంతాలు, అడవులు, జాతీయ పార్కులు, అడవి జంతువుల సంరక్షణ కేంద్రాలు, రిజర్వ్ ఫారెస్ట్, పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాలు, జీవావరణానికి మూలాధారమైన సహజ ప్రాకృతిక ప్రాంతాలకూ భూమే కేంద్రం. గ్రామాలు, పట్టణాలు, నగరాల నిర్మాణం, వ్యవసాయం, పరిశ్రమల  ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మైనింగ్ లాంటి అన్ని అవసరాలకూ భూమే కేంద్రం. 

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా..

రాజ్యాంగం 7వ షెడ్యూల్లో భూమి యాజమాన్యం, సంరక్షణ అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది. సహజ వనరులు, కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదని, భౌతిక సంపద ఎక్కువ మందికి పంపిణీ జరగాలని, ఇవన్నీ ఉమ్మడి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించబడాలని ఆర్టికల్ 39 చెబుతున్నది. అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర, జిల్లా, గ్రామాలు, మున్సిపాలిటీల స్థాయిలో రూపొందించాలని ఆర్టికల్ 243 జెడ్‌డీ(1 ) అంటున్నది. అప్పుడే సహజ వనరుల వినియోగం సవ్యంగా ఉంటుందనేది రాజ్యాంగ భావన. 1976 లో ఏర్పడిన  “వ్యవసాయంపై జాతీయ కమిషన్” ఆహార భద్రతకు, జీవనోపాధి కల్పనకు వీలుగా భూ వినియోగ కమిటీలు ఉండాలని స్పష్టంగా ప్రకటించింది. దేశంలో 1951-–52లో 0.48 హెక్టార్లు ఉన్న తలసరి వ్యవసాయ భూమి, 2007–-08 నాటికి 0.16 హెక్టార్లకు పడిపోయిందని “వ్యవసాయ సంబంధాలు – పూర్తి కాని భూ సంస్కరణల ఎజెండా’’ అనే పేరున 2009 లో విడుదలైన కమిటీ రిపోర్ట్ ఒకటి ప్రకటించింది. 2013లో నాటి కేంద్ర ప్రభుత్వం “భూమి వినియోగ విధానం డ్రాఫ్ట్ ’’ ను కూడా విడుదల చేసింది.  కానీ  తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికీ , సరైన భూమి వినియోగ విధానమే లేదు.1973 లో రూపొందిన భూ సంస్కరణల(గరిష్ట పరిమితి చట్టం) చట్టం అమలు కాలేదు. గ్రామీణ పేదలకు పంపిణీ కావాల్సిన భూమి అందలేదు. కానీ1991 నుంచి అమలవుతున్న నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల నేపథ్యంలో సహజ వనరైన భూమి జీవనోపాధి వనరుగా గాక, మార్కెట్ సరుకుగా మారిపోయింది. 

భూసేకరణ పేరుతో..

భూ సంస్కరణల చట్టాల అమలు ఆగి పోయి వ్యవసాయ భూములు విచ్చల విడిగా ఇతర అవసరాలకు మళ్లించబడుతున్నాయి. నగరీకరణ పేరుతో, లక్షలాది ఎకరాల సాగు భూములు రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోతున్నాయి. పంటలు పండాల్సిన లక్షల ఎకరాలు పడావు పడి ఉంటున్నాయి. భూ గరిష్ట పరిమితిని దాటి భూములను కొనుగోలు చేస్తున్న నయా జమీందారులు అనేక మంది వందల ఎకరాలు తమ చేతుల్లో ఉంచుకుంటున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అగ్రి ఫార్మ్స్ పేరుతో, వ్యవసాయంతో ఏ సంబంధమూ లేని అనేక మంది నగర జీవులకు వేలాది ఎకరాలు అమ్ముతున్నారు. భూమిపై పట్టా హక్కులు కలిగి ఉంటున్నారనే పేరుతో వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు రైతు బంధు పేరుతో పంపిణీ చేస్తున్నది. మరో వైపు జీవనోపాధికి వ్యవసాయం చేసుకుందామని భావిస్తున్న గ్రామీణ పేదలు భూమి హక్కుగా అందక కౌలు రైతులుగా మారుతున్నారు. మరో వైపు, పారిశ్రామిక వాడలు, ఫుడ్ పార్క్ లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, జాతీయ రహదారులు, సాగు నీటి ప్రాజెక్టులు, రింగ్ రోడ్లు, విమానాశ్రయాలు, పట్టణాల విస్తరణ, రోడ్ల వెడల్పు, రైతు వేదికలు, శ్మశాన వాటికల పేరుతో, ప్రభుత్వం అసైన్డ్ భూములు పొందిన దళిత రైతుల నుంచి భూమిని బలవంతంగా వెనక్కు గుంజుకుంటున్నది. పట్టాలు ఉన్న రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను గుంజుకుంటూ.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వారికి పునరావాసం, నష్ట పరిహారం అందించడం లేదు. ఎక్కువ సందర్భాల్లో మార్కెట్ రేట్లకు అనుగుణంగా భూముల రిజిస్టర్డ్ విలువలను సవరించకుండానే, అతి తక్కువ పరిహారం బాధిత కుటుంబాలకు అందిస్తున్నది. ఆ సాగు భూములపై ఆధార పడిన వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఎటువంటి పరిహారమూ అందించడం లేదు.  గత 7 దశాబ్దాలుగా రాష్ట్రంలో పేదల నుంచి భూములు గుంజుకొని, లేదా ప్రభుత్వ భూములను లాండ్ బ్యాంక్ గా మార్చి, పారిశ్రామికాభివృద్ధి పేరుతో  కొందరు పారిశ్రామిక వేత్తలకు భూములను కట్ట బెట్టారు. ఆ భూముల వినియోగంపై ఇప్పటి వరకు ఆడిటింగ్ చేపట్టలేదు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?, ఎంత మందికి ఉపాధి కల్పించాయి?, ఎన్ని ఎకరాల భూములు నిజంగా ఆయా సంస్థలకు ఉపయోగపడింది?, ఎన్ని ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి? అన్నది లెక్క తేల్చలేదు. ట్రస్ట్ లు, ప్లాంటేషన్ లు, సొసైటీల పేరుతో ఎన్ని ఎకరాలు వివిధ సంస్థల చేతుల్లో మూలుగుతున్నాయి అన్నది కూడా లెక్క తేల్చలేదు. ఎన్ని ప్రభుత్వ భూములు పెద్దల చేతుల్లో కబ్జాకు గురయ్యాయో కూడా లెక్క లేదు. 


వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని

తెలంగాణ ప్రభుత్వం భూమి వినియోగ విధానం తీసుకురావాలి. వివిధ పేర్లతో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూముల ఆడిటింగ్ చేయించాలి. అగ్రి ఫార్మ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో విచ్చలవిడిగా సాగు భూములను మళ్లించడంపై ఆంక్షలు విధించాలి. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారి, ప్రభుత్వ  భూములను అమ్ముకుని బడ్జెట్ కు నిధులు సమీకరించుకునే విధానాలను మార్చుకోవాలి.  ఆధునిక టెక్నాలజీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏయే అవసరాలకు ఎంత భూమి అవసరమో న్యాయంగా, శాస్త్రీయంగా అంచనా వేసి భూమి వినియోగానికి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలి. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే పూర్తి చేసి మొత్తం భూ విస్తీర్ణాన్ని, నికర సాగు భూముల విస్తీర్ణాన్ని, ఇతర భూ వినియోగం లెక్కను తేల్చాలి.  గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెరిగే జనాభా, ఇతర జీవ జాతుల అవసరాల ప్రాతిపదికగా ఎంత భూమి దేనికి కావాలో, రాబోయే 50 ఏండ్ల కాలానికి అంచనా వేసి ప్రకటించాలి.

- కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక