పట్టాదారు లేకుండానే ధరణిలో భూమి రిజిస్ట్రేషన్

పట్టాదారు లేకుండానే ధరణిలో భూమి రిజిస్ట్రేషన్
  •     అమెరికాలోని ల్యాండ్ ఓనర్ రాకున్నా.. వీణవంకలో వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్
  •     మరోసారి ధరణిలో డొల్లతనం బట్టబయలు

కరీంనగర్, వెలుగు: 'ఇవాళ రైతు భూమి మార్చాలంటే ముఖ్యమంత్రికి, సీఎస్‌‌కు కూడా పవర్‌‌లేదు. జిల్లా కలెక్టర్‌‌కు, ఏ మంత్రికి పవర్‌‌లేదు. మీ బొటనవేలుకే ఆ పవర్‌‌ఉన్నది. అంటే తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు ఆ పవర్‌‌ఇచ్చింది ప్రభుత్వం. నువ్వు గిఫ్ట్‌‌ఇస్తావా? అమ్ముకుంటావా? ఆ అధికారం మొత్తం నీ బొటనవేలుకే ఉంది.' అని గత ఎన్నికలకు ముందు సభల్లో అప్పటి సీఎం కేసీఆర్ పదేపదే చెప్పిన మాటలు ఇవి. 

కానీ కరీంనగర్ జిల్లా వీణవంకలో బొటన వేలు పెట్టకున్నా.. అసలు పట్టాదారే తహసీల్దార్ ఆఫీసుకు రాకపోయినా ధరణిలో ఒకరి భూమి మరొకరి పేరిట మారిపోయింది. ధరణి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఐరిష్, వేలిముద్రలు అనేవి వట్టివేనని మరోసారి తేలిపోయింది. ధరణిలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఈ తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 

అమెరికాలో ల్యాండ్ ఓనర్.. వీణవంక లో రిజిస్ట్రేషన్

అమెరికాలో ఉండే రామిడి శివప్రియ తనకు వీణవంకలోని సర్వే నంబర్ 1230/2/2, 1224/సీలో 20 గుంటల భూమిని సుకాసి సురేశ్​ అనే వ్యక్తికి అమ్మకానికి పెట్టారు. అయితే నిబంధనల ప్రకారం.. శివప్రియ స్థానికంగా ఉండే తన నమ్మకస్తులకు  జనరల్ పవర్ ఆఫ్​ఆటార్నీ(జీపీఏ) చేయించి.. సదరు వ్యక్తి ద్వారా సుకాసి సురేష్​ కు తన భూమి రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. కానీ అలా కుదరకపోవడంతో తహసీల్దార్ తిరుమల్ రావును సంప్రదించగా.. అమ్మకందారు అమెరికా నుంచి రాకపోయినా, వేలిముద్ర పెట్టకపోయినా, జీపీఏ హోల్డర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించారు.

 ధరణిలో ఉన్న లొసుగుతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో శివప్రియ వచ్చి కెమెరా ముందు లైవ్​గా ఫొటో దిగడంతోపాటు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యవహారంలో మాత్రం ఐరిష్ క్యాప్చర్ చేయకుండా  కేవలం ప్రింట్ చేసిన ఫొటోను కెమెరాలో ఫొటో తీయడం గమనార్హం. అలాగే వేలిముద్రలు సరిగ్గా పడనివాళ్ల కోసం పెట్టిన ఓటీపీ సౌకర్యాన్ని ఈ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించారు. 

ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా రావడం లేదంటూ రిజిష్టర్డ్ ఫోన్ నంబర్ కు ఓటీపీ వచ్చేలా చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి వెళ్లడంతో తహసీల్దార్ తిరుమల్ రావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆఫీసర్లు, సిబ్బంది మధ్య గొడవతో వ్యవహారం వెలుగులోకి.. 

శివప్రియ పేరిట ఉన్న భూమి సుకాసి సురేష్ పేరిట నిరుడు నవంబర్ 8న రిజిస్ట్రేషన్ జరిగింది. గుట్టుగా రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ.. ఇటీవల ఆఫీసర్లు, సిబ్బంది మధ్య గొడవతో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇదే ఆఫీసులో తహసీల్దార్ గా తిరుమల్ రావుతోపాటు గతంలో ధరణి ఆపరేటర్ గా అరుణ్ చౌదరి, డిప్యూటీ తహసీల్దార్ గా శ్రీనివాస్ రెడ్డి పని చేసేవారు. గత డిసెంబర్ 28న వీణవంక మండలం బేతిగల్ కు చెందిన రేణికుంట్ల రమాదేవికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసిన విషయంలో వివాదం నెలకొంది. ఈ విషయమై కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి డిజిటల్ కీ తీసుకుని ఈ సర్టిఫికెట్ ను డీటీ శ్రీనివాస్ రెడ్డి అప్రూవల్ చేశారని ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరి తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో డీటీ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఆ తర్వాత ఎఫ్ఎంసీ విషయంలోనే ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరిని కూడా సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న వ్యక్తి ఇక్కడికి రాకుండానే భూమి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ తో తనకు సంబంధం లేదని ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరి మీదికి నెట్టేందుకు తహసీల్దార్ యత్నించారు. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కలెక్టర్ తహసీల్దార్ ను సస్పెండ్ చేశారు.