కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని అనలే

కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని అనలే
  • నిర్వాసితులకు పరిహారమివ్వకుండా ఇబ్బందులు పెడుతుండు
  • మోడీ, కేసీఆర్ ఒక్కటై కాంగ్రెస్ లేకుండా చేయాలని చూస్తున్నరు
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని కిష్టరాయన్ పల్లి, శివన్నగూడెం ప్రాజెక్టుల పేరుతో పేదల భూములను ముఖ్యమంత్రి కేసీఆర్ గుంజుకుంటున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం బోటిమీది తండా, వాయిలపల్లి, జనగాం గ్రామాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

మోడీ, కేసీఆర్ ఒక్కటై కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ను ఎందుకు లేకుండా చేయాలని చూస్తున్నారో వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు పోడు భూముల పట్టాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు.

ఇప్పటిదాకా ఇయ్యలే.. ఇకపైనా ఇయ్యరు

కొడంగల్‌లో కేసీఆర్ అరాచకం సృష్టించి తనను ఓడగొట్టారని, కానీ మల్కాజిగిరి ఎంపీ పదవికి పోటీ చేస్తే హైదరాబాద్‌లో నివసిస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు తిరిగి తనను గెలిపించారని రేవంత్ అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా గెలిచి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదని.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించినా కొత్తగా నిధులు ఏమీ రావని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ చేసిన కేసీఆర్‌‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఈడీ పేరుతో హంగామా సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు ఏం స్వాధీనం చేసుకున్నదో ప్రజలకు చెప్పలేదన్నారు. 

కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని అనలే

కమ్యూనిస్టులు అమ్ముడుపోయారన్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారని, తాను అలా అన్నట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని పీసీసీ చీఫ్ అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌‌లో ఉండే నాయకుల నిర్ణయాలు ఎలా ఉన్నా కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ఆత్మ ప్రభోదానుసారం ఓట్లు వేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. మోడీ, కేసీఆర్‌‌ను నిలదీసి సమస్యలను పరిష్కరించే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.