డార్జిలింగ్లో విరిగిపడిన కొండచరియలు 20 మంది మృతి.. 12 గంటల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం

డార్జిలింగ్లో విరిగిపడిన కొండచరియలు 20 మంది మృతి.. 12 గంటల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం
  • భారీగా ఆస్తి, ప్రాణ నష్టం, కొట్టుకుపోయిన ఇండ్లు, ఐరన్ బ్రిడ్జిలు, రోడ్లు
  • తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్, మిరిక్
  • రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
  • టూరిస్ట్ ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూసివేత
  • మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం
  • ఇవాళ (అక్టోబర్ 06) ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటన

డార్జిలింగ్: బెంగాల్​లోని డార్జిలింగ్​ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మొత్తం 20 మంది చనిపోయారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. డార్జిలింగ్, మిరిక్​తో పాటు సుఖియాపోఖరి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

12 గంటల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం నార్త్ బెంగాల్​లో పర్యటిస్తానని ప్రకటించారు.

దుర్గాపూజకు వెళ్లి చిక్కుకుపోయిన టూరిస్టులు

నార్త్ బెంగాల్​లోని సరస్లీ, జస్బీర్​గావ్, మిరిక్ బస్తీ, ధార్​గావ్ (మెచి), నాగ్రకాటా, మిరిక్ లేక్ ఏరియా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మిరిక్​లో కొండ చరియలు విరిగిపడి 11 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని కాపాడినట్లు తెలిపారు. డార్జిలింగ్​లోనూ కొండ చరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ధార్​గావ్, నాగ్రకాటాలో బురదలో చిక్కుకుపోయిన 40 మందిని రెస్క్యూ చేశారు. మిరిక్​– సుఖియాపోఖరి, డార్జిలింగ్ – సిలిగురి, బెంగాల్​– సిక్కిం మధ్య రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుర్గాపూజ కోసం వేలాది మంది టూరిస్టులు ఏటా డార్జిలింగ్ వెళ్తుంటారు. భారీ వర్షాల కారణంగా వారంతా అక్కడే చిక్కుకుపోయారు. డార్జిలింగ్​లోని టూరిస్ట్ స్పాట్లను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. 

టైగర్ హిల్, రాక్ గార్డెన్​ వైపు ఎవరినీ అనుమతించడం లేదు. జల్​పాయిగురి, సిలిగురి, కూచ్​బెహార్ లోని ప్రాంతాలు నీట మునిగాయి. నార్త్ సిక్కిం, డార్జిలింగ్, కలీపోంగ్ కు వాతావరణ 
శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిలిగురి, మిరిక్​– డార్జిలింగ్​ను కలిపే ఐరన్ బ్రిడ్జి డ్యామేజ్ అయింది.

కేంద్రం అండగా ఉంటుంది: మోదీ

డార్జిలింగ్​తో పాటు చుట్టుపక్క ప్రాంతాలను వరదలు ముంచెత్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వర్షాలు, కొండ చరియలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‘‘వర్షాల కారణంగా ప్రభావితమైన ప్రాంత ప్రజలకు కేంద్రం అండగా 
ఉంటుంది. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది’’ అని మోదీ తెలిపారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మమతా

భారీ వర్షాలకు నార్త్, సౌత్ బెంగాల్ తీవ్రంగా ప్రభావితమైందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకుంటాం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం పొద్దున దాకా నాన్​స్టాప్​గా వర్షం కురిసింది. దీంతో నదుల్లో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నా. భూటాన్, సిక్కింలో కురుస్తున్న వర్షాలకు సంకోచ్ నది ఉప్పొంగింది. రెండు బ్రిడ్జిలు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. సోమవారం నార్త్ బెంగాల్​లో పర్యటిస్తా. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను,  టూరిస్టులను కాపాడాలని రెస్క్యూ సిబ్బందిని ఆదేశించాను’’ అని మమతా బెనర్జీ అన్నారు.

భూటాన్ డ్యామ్​తో డార్జిలింగ్​కు ముప్పు

భూటాన్​లోని తాలా హైడ్రోపవర్ డ్యామ్ నుంచి డార్జిలింగ్​తో పాటు నార్త్ బెంగాల్​కు ముప్పు పొంచి ఉన్నది. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా గేట్లు ఎత్తలేకపోతున్నట్లు భూటాన్ డ్యామ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. దీంతో భారీగా వరద చేరి డ్యామ్ ఓవర్ ఫ్లో అయింది. దీంతో బెంగాల్ అధికారులను భూటాన్ అప్రమత్తం చేసింది. డ్యామ్ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చాలని కోరారు. దీంతో అలీపుర్దువార్​లోని సిబ్బందిని అలర్ట్​గా ఉంచినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది.