ఎల్ అండ్​ టీకి వరంగల్ హాస్పిటల్ టెండర్‌‌

ఎల్ అండ్​ టీకి వరంగల్ హాస్పిటల్ టెండర్‌‌

హైదరాబాద్, వెలుగు: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ టెండర్‌‌ను ఎల్ అండ్​ టీ దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఎల్ అండ్​ టీ, షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. తక్కువ మొత్తానికి కోట్ చేసిన ఎల్ అండ్​ టీ టెండర్ దక్కించుకుంది. ఎల్ అండ్ ​టీ రూ.1,116.1 కోట్లకు టెండర్​ కోట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన ‘లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ’ పత్రాన్ని ఎల్ అండ్​ టీ ప్రతినిధులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. అనంతరం వర్క్ ప్రోగ్రాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మొత్తం హాస్పిటల్‌‌ను బ్లాకులుగా విభజించి ఎక్కువ మంది సిబ్బంది పర్యవేక్షణలో పనులు వేగంగా జరిగేలా చూడాలని, ఇన్​టైంలో పనులు పూర్తిచేయాలని కంపెనీ ప్రతినిధులను ప్రశాంత్​రెడ్డి ఆదేశించారు. ఈ వర్షాకాలం నాటికి మట్టి పనులు, కాంక్రీట్  పనులు పూర్తి కావాలన్నారు. ఆర్ అండ్​ బీ తరపున ఈఎన్సీ గణపతిరెడ్డి నోడల్ అధికారిగా ఉంటారని చెప్పారు. సోమవారం హైదరాబాద్​లోని ఎర్రమంజిల్ ఆర్ అండ్​ బీ ఆఫీసులో వరంగల్ హాస్పిటల్, అమరవీరుల స్థూపం, సెక్రటేరియట్ పనులపై మంత్రి రివ్యూ చేశారు.

దసరా కల్లా సెక్రటేరియట్​ పనులు పూర్తి చేయాలె

దసరా కల్లా సెక్రటేరియట్ పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ ని మంత్రి ఆదేశించారు. అమరవీరుల స్థూపం నిర్మాణ పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఖ్యాతి ఉట్టి పడేలా ఫినిషింగ్  పనులు ఉండాలని సూచించారు. ఎంట్రీ గేట్, కాంపౌండ్ వాల్ రెయిలింగ్, పోడియం ప్రాంగణం, మెయిన్ ఎంట్రన్స్ లోని వాటర్ ఫౌంటెయిన్, ర్యాంపు, ఫ్లోరింగ్, ఫొటో గ్యాలరీ, మ్యూజియం, ఆడిటోరియం, టెర్రస్ రెస్టారెంట్, ఎస్కలేటర్ ఏరియా, లిఫ్ట్ ల పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్కిటెక్ట్, వర్క్ ఏజన్సీలకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్ అండ్​ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు లింగారెడ్డి, హఫీజుద్దీన్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లు, ఇతర అధికారులు ఉన్నారు.