జోరుగా నామినేషన్లు .. ఏకాదశి కావడంతో రిటర్నింగ్​  ఆఫీసులకు అభ్యర్థుల క్యూ

జోరుగా నామినేషన్లు .. ఏకాదశి కావడంతో రిటర్నింగ్​  ఆఫీసులకు అభ్యర్థుల క్యూ
  • ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. రోడ్​షోలు
  • గజ్వేల్​, కామారెడ్డిలో నామినేషన్లు వేసిన కేసీఆర్​
  • దాఖలు చేసిన వారిలో.. కేటీఆర్​, హరీశ్ రావు, భట్టి విక్రమార్క, ఉత్తమ్​, వివేక్​ వెంకటస్వామి తదితరులు
  • ఒక్కరోజే 1,129 నామినేషన్లు.. నేటితో గడువు పూర్తి

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో గురువారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి కావడంతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామితో పాటు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నెల 3 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా 119 నియోజకవర్గాల్లో బుధవారం వరకు 1,188 మంది అభ్యర్థులు 1,518 సెట్ల నామినేషన్లు వేశారు. గురువారం ఒక్కరోజే 1,129  నామినేషన్లు దాఖలయ్యాయి. 

రోడ్లపై భారీ ర్యాలీలు కనిపించాయి. చాలా చోట్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ఈ నెల 13న నామినేషన్ల స్ర్కూటినీ, 15 లోపు నామినేషన్ల విత్​డ్రాకు అవకాశం ఉంటుది.  15ననే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది. 

రెండు చోట్ల కేసీఆర్..​

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్​ గురువారం నామినేషన్​ వేశారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్​లో గజ్వేల్​ ఐవోసీ వెనుకాల ఉన్న  గ్రౌండ్​కు కేసీఆర్​ చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో ఆయన నామినేషన్​ వేయడానికి బయలు దేరారు. ఐవోసీలోని ఆర్డీవో ఆఫీసులో రిటర్నింగ్​ఆఫీసర్​కు రెండు సెట్ల నామినేషన్​ పత్రాలు సమర్పించారు. అనంతరం హెలీప్యాడ్​ మైదానానికి చేరుకుని ప్రచారం రథంపై ఎక్కి మైదానం చుట్టూ తిరుగుతూ అక్కడికి వచ్చినవారికి అభివాదం చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్​లో కామారెడ్డి వెళ్లారు. అక్కడ తొలుత బీఆర్‌‌ఎస్‌‌ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆపై కామారెడ్డి ఆర్డీవో ఆఫీసుకు చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌‌ వేశారు. 

ఎక్కడివారు అక్కడ

సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్,  జీహెచ్​ఎంసీ ఆఫీసులో సనత్‌‌నగర్‌‌ బీఆర్​ఎస్​ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ నామినేషన్‌‌ దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్‌‌ వేశారు. అంతకుముందు ఆయన వైరాలోని దేవాలయంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నూరులో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వివేక్ వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారు. పారేపల్లి కాల భైరవస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి పద్మావతిరెడ్డి, హుజూర్​నగర్ రిటర్నింగ్​ ఆఫీస్​లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్‌‌ వేశారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌ అభ్యర్థి జైవీర్‌‌రెడ్డి నిడమనూరులో నామినేషన్‌‌ వేశారు. కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ నేత జానారెడ్డి కూడా అదేస్థానానికి నామినేషన్‌‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి మల్‌‌రెడ్డి రంగారెడ్డి.. బీఆర్​ఎస్​ అభ్యర్థి, సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి ఒకే రోజు నామినేషన్ వేశారు. రెండు పార్టీల నామినేషన్లతో ఓ దశలో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు.  కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

ఖైరతాబాద్‌‌ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి కూడా నామినేషన్​ సమర్పించారు. సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పరకాలలో అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కార్యకర్తలతో రిటర్నింగ్‌‌ కేంద్రానికి చేరుకున్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్​ఎస్​ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌‌రెడ్డి దుబ్బాకలో నామినేషన్‌‌ వేశారు. హైదరాబాద్‌‌ యశోదా ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌‌లో దుబ్బాకకు వచ్చిన ఆయన.. వీల్‌‌చైర్‌‌పై వెళ్లి  నామినేషన్​ సమర్పించారు.