
‘త్రీడీ’తో కట్టిన బంగళా
ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలంటే దుబాయ్‌కే చెల్లుతుంది. ప్రపంచంల అన్నింటికన్నా పెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా అక్కడే కదా ఉంది. ఇప్పుడు మరో ఘనత కొట్టేసింది ఆ దేశం. త్రీడీ ప్రింటింగ్‌తో బిల్డింగ్ కట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ ప్రింటెడ్ బిల్డింగ్‌గా రికార్డు కొట్టేసింది. బోస్టన్‌కు చెందిన ఏపిస్ కోర్ అనే త్రీడీ ప్రింటింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీ సహకారంతో 6,300 చదరపుటడుగుల భవనాన్ని తీర్చిదిద్దింది. దీని ఎత్తు 9.5 మీటర్లు. నిజానికి చైనాలోని సుఝూలో ఎత్తైన త్రీడీ ప్రింటెడ్ బిల్డింగ్ ఉంది. దాని ఎత్తు 90 అడుగులు. కానీ, విస్తీర్ణం పరంగా మాత్రం దుబాయ్‌లో కట్టిన ఈ బిల్డింగే పెద్దది. రీసైకిల్ చేసిన నిర్మాణ వ్యర్థాలు, సిమెంట్, జిప్సం, ఇతర పదార్థాలతో త్రీడీ ప్రింటింగ్ ద్వారా బిల్డింగ్‌ను నిర్మించారు. మామూలు కాంక్రీట్‌తో పోలిస్తే ఈ పద్ధతిలో తయారైన కాంక్రీట్ 50 శాతం తేలికగా ఉండడంతో పాటు, గట్టిదనం కూడా ఎక్కువట. త్రీడీ ప్రింటింగ్ పద్ధతిలో గోడలు, బేస్‌ను నిర్మించినా, శ్లాబ్ పోసింది మాత్రం మేషనోళ్లే. 2030 నాటికల్లా 25 శాతం బిల్డింగులను ఇలాగే కట్టాలని దుబాయ్ మున్సిపాలిటీ నిర్ణయించింది. దీని వల్ల కూలీల అవసరం 70 శాతం తగ్గడంతో పాటు, నిర్మాణ ఖర్చు కూడా 90 శాతం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు .