
న్యూఢిల్లీ: కొత్త జీఎస్టీ విధానం కోసం ఎదురుచూపులు, గిరాకీ తగ్గడంతో దేశంలోని టాప్ ఆటోమొబైల్ సంస్థల వాహన అమ్మకాలు గత నెల పడిపోయాయి. వినియోగదారులు జీఎస్టీ తగ్గింపు తర్వాత వాహనాల ధరలు తగ్గుతాయని భావించి, కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో వాహనాల తయారీ కంపెనీలు డీలర్లకు పంపే బండ్ల సంఖ్య తగ్గింది. దాదాపు అన్ని కంపెనీల అమ్మకాలు నిరాశపర్చాయి.- జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 3-–4 తేదీల్లో సమావేశం కానుంది. కేంద్రం ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం జీఎస్టీని 5 శాతం, 18 శాతంగా వర్గీకరించనున్నారు. కార్లు, బైకులపై జీఎస్టీ 10 శాతం వరకు తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
మారుతి సుజుకి
భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గత నెలలో దేశీయ మార్కెట్లోకి పంపిన (డిస్పాచ్లు)ప్యాసింజర్ వాహనాల సంఖ్య 8 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో 1,43,075 యూనిట్లు పంపగా, గత నెలలో 1,31,278 యూనిట్లు మాత్రమే పంపింది. మినీ సెగ్మెంట్ కార్లు ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు ఆగస్టు 2024లో 10,648 యూనిట్లు ఉండగా, గత నెలలో 6,853 యూనిట్లకు పడిపోయాయి. బాలెనో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 58,051 యూనిట్ల నుంచి 59,597 యూనిట్లకు పెరిగాయి. గ్రాండ్ విటారా, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు 62,684 యూనిట్ల నుంచి 54,043 యూనిట్లకు తగ్గి 14 శాతం పడిపోయాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ డీలర్లకు పంపే వాహనాల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 11 శాతం తగ్గి 44,001 యూనిట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 49,525 యూనిట్లుగా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నెలలో 9 శాతం తగ్గి 39,399 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఆగస్టులో 43,277 యూనిట్లుగా ఉన్నాయి. తుది జీఎస్టీ ప్రకటన సమీపిస్తున్నందున తమ డీలర్ల వద్ద ఉన్న నిల్వలను తగ్గించడానికి హోల్సేల్ బిల్లింగ్ను తగ్గించాలని నిర్ణయించుకున్నామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. -- ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గత నెలలో 7 శాతం తగ్గి 41,001 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆగస్టు 2024లో ఇది 44,142 యూనిట్లుగా ఉంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) గత నెలలో దేశీయ హోల్సేల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 2 శాతం పెరిగి 29,302 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆగస్టు 2024లో 28,589 యూనిట్లను డిస్పాచ్చేసింది.