
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) రాబోయే ఐదేళ్లలో 12 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.99 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో మూడు వంతుల మొత్తాన్ని క్లీన్ఎనర్జీ బిజినెస్ విస్తరణ కోసం వాడనుంది. కంపెనీ దాదాపు 4 బిలియన్ల పెట్టుబడితో 2-3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియా ప్లాంటును నిర్మించాలని భావిస్తోంది.
హైడ్రోజన్ ప్లాంట్ల కోసం 500–-1,000 ఎకరాల భూమిని సేకరించేందుకు భారతదేశంలోని కొన్ని తీర ప్రాంత రాష్ట్రాలను ఎల్ అండ్ టీ సంప్రదించినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరులో ఏఎం నాయక్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పానిపట్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రిఫైనరీలో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి సంస్థ ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం రెన్యువబుల్ఎనర్జీతో నడిచే ఎలక్ట్రోలైజర్‌లను తయారు చేయడం ద్వారా హైడ్రోజన్ తయారీలోకి అడుగుపెడుతుంది. ఈ ప్రాజెక్ట్ మరిన్ని ఐఓసీ రిఫైనరీలు, ఇతర ఎల్ అండ్ టీ కస్టమర్లకు సేవలు అందిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌తో సహా పెద్ద పలు బడా కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఉన్నాయి. అయినప్పటికీ, పెద్ద-స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద గిట్టుబాటు కాదని కంపెనీలు అంటున్నాయి. ఖర్చులను నియంత్రించడంలో ఎలక్ట్రోలైజర్, రెన్యువబుల్ ఎనర్జీ ధరలు కీలకం. టారిఫ్‌లు తగ్గకపోతే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సాధ్యం కాదని సుబ్రహ్మణ్యన్ అన్నారు. సుంకాలు తగ్గితే ఎల్ అండ్ టీ తన పెట్టుబడులను వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు.