విశ్లేషణ: ప్రశ్నించకపోవడం వల్లే రాజకీయాల్లో అస్థిరత పెరుగుతోంది

విశ్లేషణ:  ప్రశ్నించకపోవడం వల్లే రాజకీయాల్లో అస్థిరత పెరుగుతోంది

ప్ర జాస్వామ్యంలో  ప్రజలు   తమ   ఓటు హక్కు  ద్వారా వివిధ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నికల ప్రక్రియ, ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది.  అయితే  ఒక  రాజకీయ  పార్టీ  తరఫున  ఎన్నికైన   సభ్యులు  అధికారం కోసం తరచుగా మరో పార్టీలోకి మారుతున్నారు. విలువలకు తిలోదకాలిచ్చి అవకాశ వాదంతో పార్టీలను ఫిరాయించడం వల్ల రాజకీయ అస్థిరత్వం ఏర్పడటంతో పాటు ప్రజాభిప్రాయానికి భంగం వాటిల్లుతోంది.

నానాటికీ  జటిలమవుతున్న ఈ సమస్యను  అరికట్టడానికి   నిబంధనలను  కఠినతరం చేయాల్సిన అవసరం   ఎంతైనా  ఉంది. భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పార్టీ ఫిరాయింపులు ఒకటి. 1967 తర్వాత   భారత  రాజకీయాల్లో  ముఖ్యంగా  రాష్ట్రాల్లో  పార్టీ ఫిరాయింపులు  చాలా  అధికమయ్యాయి. పార్టీ  ఫిరాయింపులను   నివారించడానికి   కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక  ప్రయత్నాలు జరిగాయి.

 తొలిసారిగా   పశ్చిమబెంగాల్ రాష్ట్రం 1979లో పార్టీ ఫిరాయింపుల   నిరోధక  చట్టాన్ని రూపొందించింది.  దీనికి  పరిష్కారంగా1985 లో  52 వ రాజ్యాంగ  సవరణ చట్టం ద్వారా  కేంద్ర  ప్రభుత్వం  పార్టీ  ఫిరాయింపుల  నిరోధక   చట్టాన్ని  పదవ  షెడ్యూల్ లో చేర్చింది. ఈ  చట్టంలోని  లోపాలను సవరిస్తూ  2003 లో 91వ  రాజ్యాంగ  సవరణ  చట్టం  చేసింది.  అయినప్పటికీ  దేశంలో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి.    

తెలంగాణలో పరిస్థితి
తెలంగాణలో  2018   శాసనసభ   ఎన్నికల్లో  అధికార  పార్టీ   అన్ని చోట్లా గెలిచినా,  కొన్ని  నియోజకవర్గాల్లో   మాత్రం   ఎదురుగాలి  వీచింది.  గెలిచిన ప్రతిపక్ష  ఎమ్మెల్యేలు   కొన్ని   రోజులు   విధేయంగా ఉండి, అభివృద్ధి   జరగాలంటే   అధికార   పార్టీలోనే   ఉండాలనే సాకులు చెబుతూ అధికార పార్టీలో చేరారు. ప్రజల   ఓటుకు   ఎంతమాత్రం   విలువలేదని,   ఈ దేశంలోని ఏ చట్టమూ తమను  శిక్షించలేదని,   ప్రజలు   కూడా   కొన్ని  రోజుల్లో దీన్ని మర్చిపోతారని  ఫిరాయింపుదారులు భావిస్తున్నారు.

విచ్చలవిడి పార్టీల మార్పు  రాజకీయాల్లో   నైతిక   విలువల   పతనానికి సూచిక. అందుకే ఎన్నికలంటే   ప్రజల్లో నిరాసక్తత  పెరుగుతున్నది. ప్రజాస్వామ్య   విలువలు   మట్టిగొట్టుకుపోతున్నాయి.  నాయకుల్లో జవాబుదారీతనం  లేదు. ఫిరాయింపుల  చట్టం  అమలులోకి  వచ్చి 36 ఏండ్లు అవుతున్నా కూడా  ఆ చట్టం   తన   ప్రభావాన్ని చూపలేకపోతున్నది.

అందుకు   కారణం   ప్రతి   రాష్ట్రం,   ప్రతి రాజకీయ  పార్టీ   కూడా   పార్టీ   ఫిరాయిపులను తెర వెనుకగా ప్రోత్సహించడమే. ఇది  బహిరంగ రహస్యం. అంతిమ   నిర్ణయం   సభాపతులకు   వదిలిపెట్టడం  అనేది   చట్టంలో  ఉన్న అతి   ముఖ్యమైన లోపం. ఇలాంటి లొసుగుల వల్ల ఈ చట్టం శిక్షించడానికి కాకుండా అవినీతి రాజకీయ నాయకులను రక్షించడానికి ఉపయోగపడుతున్నది. 

పౌరులు ప్రశ్నించాలి

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం   ప్రకారం   తీసుకొనే  నిర్ణయాల్లో  కోర్టుల  పాత్రను  చట్ట  ప్రకారమే  నిరోధించడం  జరిగింది. ఈ చట్టం  అమలుకు  కోర్టుల   ప్రమేయం   ప్రస్తుతానికి   ఏమీ   లేదు.  అయితే ఏ చట్టాలనైనా సమీక్షించే అధికారం, అవకాశం సుప్రీంకోర్టుకు ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. 1993లో  కీమోట ఝలోహన్   వర్సెస్   జాచిలు   కేసులో   స్పీకర్   నిర్ణయం  అంతిమం   కాదని   అది   న్యాయ   సమీక్షకు లోబడి   ఉంటుందని   సుప్రీం కోర్టు తెలిపింది.

ఫిరాయింపుల   చట్టం  కింద  ఫిర్యాదు  వచ్చినా   దాన్ని తొక్కిపెట్టే   విచక్షణాధికారం  స్పీకర్లకు  చట్ట   ప్రకారమే   కల్పించారు.   దాని   గురించి   ఇక   అడిగేవారే లేరు.   చట్టంలో   ఉన్న  ప్రధాన   లోపం   ఇది.   అందుకే    ఓటు వేసే ముందు ఓటర్లు   సరైన  నిర్ణయం  తీసుకోవాలి.  పార్టీ   ఫిరాయింపులపై   ప్రతి   పౌరుడు   ప్రశ్నించాలి.   లేకపోతే   రాజకీయాల్లో అస్థిరత పెరుగుతుంది.   - జటావత్  హనుము, రీసెర్చ్  స్కాలర్, ఓయూ