కోరుట్ల, వెలుగు: చదువుకు వయస్సుతో సంబంధం లేదని మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మరోసారి నిరూపించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదలైన లా సెట్ ఫలితాల్లో ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షలో 57 మార్కులు సాధించి 349వ ర్యాంకు సాధించారు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ, దాదాపు 42 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్‌లో మిగిలిపోయిన తెలుగు సబ్జెక్టును ఇంటర్ బోర్డు ప్రత్యేక అనుమతితో పూర్తి చేశారు. అనంతరం ఎల్ఎల్బీలో ప్రవేశం కోసం నిర్వహించిన లాసెట్ పరీక్షకు హాజరై మంచి ర్యాంకు సాధించారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో తాను చదువు కొనసాగిస్తున్నట్లు దేవ్‌జీ తెలిపారు. 60 ఏండ్ల వయస్సులో ఉత్తమ ర్యాంకు సాధించడం విశేషం.
