పిల్లలూ వేధించొద్దు.. మాకు చట్టాలున్నయ్

పిల్లలూ వేధించొద్దు.. మాకు చట్టాలున్నయ్
  • తమ పిల్లలు ఇబ్బందులు పెట్టినట్టు అధికారులకు ఫిర్యాదులు 
  • 122  కేసులు పరిష్కరించగా.. ప్రాసెస్​లో మరో 37 
  • సీనియర్ సిటిజన్స్ కు అండగా రక్షణ చట్టాలు

హైదరాబాద్​, వెలుగు: ‘‘ సిటీకి చెందిన 75 ఏండ్ల ఓ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. తన పేరు మీద 150 గజాల స్థలం ఉండగా.. అది అమ్మి శివారులో ఓ ఇల్లు కొనుక్కొందామని ఆమె నిర్ణయించుకుంది. కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యక్తి రూ. 10 లక్షలు అడ్వాన్స్​గా ఇచ్చాడు.  తన చిన్న కొడుకు బెదిరించి ఆస్తిని తన పేరిట గిఫ్ట్​ డీడ్​గా రాయించుకుని.. ఆపై ఇంట్లో బంధించాడు.  పెద్ద కొడుకు , అడ్వాన్స్ డబ్బులు ఇచ్చిన వ్యక్తితో కలిసి హైదరాబాద్​ కలెక్టర్​కు కంప్లయింట్ చేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్  వృద్ధురాలితో మాట్లాడి  గిఫ్ట్​ డీడ్​క్యాన్సిల్​ చేయించారు.’’

“సిటీకి చెందిన 70 ఏండ్ల ఓ వృద్ధుడికి రెండు అంతస్తుల ఇల్లు ఉంది. అతని కొడుకు ఫారెన్ లో సెటిల్ అయ్యాడు. ఇంటిని ఓ అడ్వకేట్​కు రెంట్ కు ఇచ్చిన వృద్ధుడు తను  సిటీలోనే ఉండే కూతురు వద్ద ఉంటున్నాడు. కరోనా టైమ్ నుంచి అడ్వకేట్ ఇంటి అద్దె, కరెంట్, వాటర్ బిల్లులు​చెల్లించడం లేదు. ఇదేంటని వృద్ధుడు అడగ్గా ‘నేను అడ్వకేట్​ను. ఏం చేస్తావో చేస్కో’ అంటూ బెదిరించేవాడు. దీంతో వృద్ధుడు హైదరాబాద్​కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు. అడ్వకేట్​ను కలెక్టర్ ​పిలిపించి విచారించారు. ఎలాంటి ఫ్రూప్స్​ చూపకపోవడంతో నెల తర్వాత ఆర్డీవో, తహశీల్దార్ దగ్గరుండి అడ్వకేట్​ను ఇల్లు ఖాళీ చేయించారు.’’ 

పిల్లలను కని, పెంచి, పెద్దచేశాక వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతలను పట్టించుకోని, చీదరించుకునే ఘటనలు చూస్తూనే ఉంటాం. అంతేకాదు వృద్ధ తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా వేధించడం, వారి ఆస్తులను బలవంతంగా పిల్లలు తమ పేరుమీద రాయించుకోవడం.. ఆపై ఇంట్లోంచి వెళ్లగొట్టడం, లేదంటే ఓల్డేజ్​హోమ్ ల్లో చేర్పించడం.. వంటివి కూడా కన్పిస్తుంటాయి. అయితే.. పిల్లల వేధింపులు భరించలేని వృద్ధ తల్లిదండ్రులు కొందరు అధికారులకు కంప్లయింట్ చేస్తుండగా.. మరికొందరు చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. కాగా.. వృద్ధుల వేధింపులపై గతేడాది నుంచి ఇప్పటివరకు హైదరాబాద్​జిల్లాలో మొత్తం176 కేసులు నమోదు అయ్యాయి.  దీంతో వీటిపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులకు, ప్రజావాణిలో సీనియర్ సిటిజన్స్​నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్​లో సీనియర్ సిటిజన్స్​కేసుల హియరింగ్స్​కోసం స్పెషల్ టైమ్ కూడా కేటాయిస్తున్నారు. మెయింటెనెన్స్​అండ్​వెల్ఫేర్​ఆఫ్​పేరెంట్స్​అండ్​సీనియర్​సిటిజన్స్​యాక్ట్​ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో  వృద్ధ తల్లిదండ్రులను  సరిగ్గా చూసుకోవట్లేదనే కంప్లయింట్లు మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్​జిల్లాలోనే ఎక్కువగా వస్తున్నాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 2023 నుంచి ఇప్పటివరకు మొత్తం 176  సీనియర్ సిటీజన్స్​కంప్లైంట్స్ వచ్చాయి. వీటిలో కొడుకులు, కూతుర్లు, కోడళ్లు, సంరక్షకులు వృద్ధులను పట్టించుకోకపోవడం, ఇండ్లల్లోంచి వెళ్లగొట్టడం, శారీరకంగా హింసించడం, మానసిక, ఆర్థిక, ఆస్తి సంబంధిత వేధింపులు అధికంగా ఉంటున్నాయి. వచ్చిన కంప్లయింట్లలో  అధికారులు 122 పరిష్కరించారు. 

రక్షణగా ఎమ్​డబ్ల్యూపీఎస్​సీ యాక్ట్ 

పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే కఠిన చట్టాల ద్వారా శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మెయింటనెన్స్ అండ్​వెల్ఫేర్​ఆఫ్​పేరెంట్స్​అండ్​సీనియర్ సిటిజన్స్​యాక్ట్​ – 2011కు, 2022 లో కీలక సవరణలు చేశారు. దీని ప్రకారం.. ఆస్తులను గిఫ్ట్ డీడ్​ కింద పిల్లలకు లేదా సంరక్షకులకు ఇచ్చినప్పుడు ఆ వృద్ధులను సరిగ్గా చూసుకోకపోతే.. ఆ గిఫ్ట్ డీడ్​ను క్యాన్సిల్ చేయొచ్చు. సీనియర్​ సిటిజన్స్​ఆస్తులను అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నా.. రద్దు చేసే అధికారాలు కలెక్టర్​కు ఉన్నాయి.   మానసికంగా, శారీరకంగా హింసిస్తే  ఎమ్​డబ్ల్యూపీఎస్​సీ యాక్ట్ ద్వారా ఇంట్లోంచి బయటకు పంపడం,  ప్రొటెక్షన్​ఆఫ్​లైఫ్​అండ్ ప్రాపర్టీ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కింద పరిగణించి సీఆర్​పీసీ సెక్షన్​ 125 ప్రకారం 3 నెలల జైలు శిక్షా, 5 వేల ఫైన్​విధిస్తారు.