సీజేఐపై దాడికి యత్నించిన లాయర్పై బహిష్కరణ వేటు

సీజేఐపై దాడికి  యత్నించిన లాయర్పై బహిష్కరణ వేటు
  • సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చర్యలు 
  • ఎంట్రీ కార్డు రద్దు.. కోర్టులోకి ప్రవేశం నిషేధం  

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్​గవాయ్ పై షూను విసిరేందుకు ప్రయత్నించిన అడ్వకేట్​రాకేశ్ కిషోర్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) బార్ నుంచి బహిష్కరించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. అతని ఎంట్రీ కార్డును రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ‘‘ఇలాంటి దుర్మార్గమైన, సంస్కార రహిత, క్రమశిక్షణారాహిత్యమైన ప్రవర్తనను సహించలేం. ఇది అనుచితం, అమర్యాదకరం.. సుప్రీంకోర్టు గౌరవాన్ని ఉల్లంఘించడమే” అని ఎస్సీబీఏ నోటీసులో పేర్కొంది. 

కాగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అతని లైసెన్సును ఇప్పటికే సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 16న ఒక పిల్ విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ కామెంట్లను వ్యతిరేకిస్తూ అడ్వకేట్ కిశోర్​ ఈ ఘటనకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఇటీవల అతను మీడియాతో మాట్లాడుతూ ‘‘పిల్‌పై డిఫెన్స్ ఇచ్చే విషయంలో సహాయం చేయకపోయినా పర్వాలేదు. కానీ అవమానించకూడదు. నేను బాధపడ్డాను. ఆ సమయంలో మద్యం తాగలేదు. ఇది సీజేఐ చర్యకు నా రియాక్షన్. ఇందుకు పశ్చాత్తాప పడట్లేదు. భయపడట్లేదు’’ అని అన్నారు. 

ముందు మేం షాకయ్యాం.. 

తనపై దాడి ఘటనపై సీజేఐ జస్టిస్ గవాయ్ గురువారం మరోసారి స్పందించారు. అడ్వకేట్ దాడితో ముందు తాము షాకయ్యా మని తెలిపారు. ఈ చర్య తనకు జస్టిస్ చంద్రన్‌కు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయితే ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశామని చెప్పారు. మరోవైపు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ చర్యను సుప్రీం కోర్టుపై దాడిగా భావించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చర్యను క్షమించరానిదిగా పేర్కొన్నారు.