పార్లమెంట్​ ఎన్నికలకు రెఢీ .. బీజేపీలోనూ టికెట్ ​కోసం తీవ్ర పోటీ

పార్లమెంట్​ ఎన్నికలకు రెఢీ .. బీజేపీలోనూ టికెట్ ​కోసం తీవ్ర పోటీ
  • జహీరాబాద్​లో త్రిముఖపోరు
  • కాంగ్రెస్ ​టికెట్ ​కోసం నలుగురు అప్లికేషన్​
  • బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ​ఎంపీకి ఛాన్స్​ దక్కేనా?

కామారెడ్డి, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల లీడర్లు పోటీ పడుతున్నారు. టికెట్​ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ క్యాడర్​పై పట్టు పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.

కాంగ్రెస్​ నుంచి నలుగురు అప్లయ్​

ఎంపీ టికెట్​ఆశిస్తున్న లీడర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇటీవల అప్లికేషన్లు స్వీకరించింది. మాజీ ఎంపీ సురేశ్​షెట్కార్, ఎన్ఆర్ఐ ఉజ్వల్​రెడ్డితో పాటు మరో ఇద్దరు అప్లయ్​చేసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఉన్న రిలేషన్స్, వివిధ కుల సమీకరణలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల ప్రభావంతో తమకే టికెట్​వస్తుందని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. పార్టీ సైతం పార్లమెంట్​పరిధిలోని ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖులు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పలుపంచుకుంటున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. స్టేట్​లో అధికారంలో ఉన్నందున పార్లమెంట్​ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. 

బీజేపీలో ఆశావహులు ఎక్కువ..

కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పాగా వేయాలని చూస్తోంది. ప్రధాన మంత్రి మోదీ చరిష్మా, అయోధ్యలో రామాలయం ప్రారంభం తదితర అంశాలు కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ లీడర్లు భావిస్తున్నారు. దీంతో జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్​పరిధిలోని కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించింది.

మిగతా నియోజకవర్గాల్లోనూ గతంలో కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్లమెంట్​సెగ్మెంట్​ఇన్​చార్జిగా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని నియమించింది. ఈయన ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో మీటింగ్​లు నిర్వహిస్తూ, క్యాడర్​ను సమాయత్తం చేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోటీకి ఆశావహుల సంఖ్య పెరిగింది. సెంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్​ జైపాల్​రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మారెడ్డి, మురళీధర్​గౌడ్, సుభాష్​రెడ్డి తదితరులు టికెట్​ ఆశిస్తున్నారు. 

యంత్రాంగం సన్నాహాలు

పార్లమెంట్​ఎన్నిక కోసం యంత్రాంగం రెడీ అవుతోంది. ఈ నెల 8న ఎలక్షన్​కమిషన్​ఫైనల్​ఓటర్​లిస్ట్​ను ప్రకటించింది. జహీరాబాద్​ పార్లమెంట్​పరిధిలో మొత్తం 16,31,561 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,73,630  మంది ఓటర్లు, సంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 7,57,931 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా నోడల్​ఆఫీసర్ల లిస్ట్​ను కలెక్టర్ ఉన్నతాధికారులకు పంపారు.

సిట్టింగ్ ​ఎంపీకి టికెట్ ​దక్కేనా?

బీఆర్ఎస్​నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన బీబీ పాటిల్​ ఈ సారి కూడా తనకే టికెట్​ వస్తుందని ధీమాతో ఉన్నారు. అధిష్టానం మాత్రం ఇంకా ఫైనల్​ చేయలేదు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి కొడుకు పోచారం భాస్కర్​రెడ్డి తనకు పార్టీ అవకాశమిస్తే బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీంతో ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డి కూడా పోటీ చేయొచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.