
- అరకోటి ఉంటే పోటీ చేసేందుకు రెడీ అంటున్న నేతలు
- రిజర్వేషన్లు తేలకముందే గల్లీ గల్లీలో ముందస్తు ఏర్పాట్లు
- ఇప్పటికే ఒక్కో నేత 5లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు
- న్యూ ఇయర్ ధూంధాంకు స్పెషల్ అరేంజ్మెంట్స్
- ఇది జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటున్న ఆశావహులు
- మేయర్, చైర్పర్సన్ పదవుల కోసం కూడా ఇప్పుడే లెక్కలు
- పార్టీ టికెట్వస్తే ఓకే.. లేకపోతే ఒంటరిగానే బరిలోకి..!
పోరగాండ్లు, పెద్దమనుషులకు చికెన్లు, మటన్లతో జబర్దస్త్ దావత్‌లు. ఏమన్నా అంటే న్యూ ఇయర్ పేరు చెప్పుడు. ఆడోళ్లకు ముగ్గుల పోటీలు.. మంచి మంచి గిఫ్ట్‌లు.ఎందుకన్నా అంటే సంక్రాంతి అనుడు.
ఏదో ఒక బహానా జెప్పి.. ఇంటింటికీ ఏదో ఒకటి ముట్టజెప్పాలె. రిజర్వేషన్లు ఖరారు కాలేదు,
పార్టీ టికెట్ వస్తదో రాదో తెల్వదు.. అయినా కీసాల కెళ్లి పైసల్ తీస్తున్నరు. అరకోటి దాక ఖర్చులకు
సై అంటున్నరు. కౌన్సిలర్, కార్పొరేటర్ రేస్‌ల ఉన్నోళ్ల లెక్క ఇది.
హైదరాబాద్, వెలుగు:
ఇంకా మున్సిపోల్స్ రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. టికెట్ ఎవరికి వస్తుందో తెలియదు.. కానీ, ఆశావహులు మాత్రం ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లక్షలు కుమ్మరిస్తున్నారు. వివిధ కార్యక్రమాల పేరిట ఓ దఫా పంపకాలు పూర్తి చేసుకొని.. న్యూ ఇయర్ రోజు స్పెషల్ దావత్‌లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్‌గా బరిలో దిగాలనుకునేవారు రూ. 50లక్షల వరకు, మున్సిపల్ కౌన్సిలర్‌గా బరిలోకి దిగాలనుకునేవారు రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందునుంచే కొందరు నేతలు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు షురూ జేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందునుంచే కొందరు నేతలు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు షురూజేశారు. షెడ్యూల్ ఖరారు కావడంతో వ్యూహాలకు మరింత పదునుపెట్టారు. పార్టీ టికెట్ తమకే వస్తుందన్న నమ్మకంతో ప్రధాన పార్టీల ఆశావహులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు అనుకూలించకపోతే తమ కుటుంబంలో కానీ, తమ అనుచరుల్లో కానీ ఎవరినైనా బరిలోకి దింపొచ్చని భావిస్తున్నారు.
పైసలే పైసలు
గ్రేటర్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో డివిజన్, వార్డులో ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్నవారు ఒక్కొక్కరు కనీసం రూ. 50 లక్షలు ఖర్చు చేయడానికి సై అంటున్నారు. ఇతర కార్పొరేషన్లలోనూ ఇదే స్థాయిలో ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. భారీ ఖర్చులో టీఆర్‌ఎస్ ఆశావహుల సంఖ్యే ఎక్కువగా ఉండగా.. మిగతా పార్టీల నుంచి కొన్ని వార్డుల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు సైతం అంతే మొత్తం ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర మున్సిపాలిటీల్లోని జనరల్ వార్డుల్లో రూ. 30 లక్షలకు పైగా, రిజర్వుడ్ వార్డుల్లో రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసేందుకు నేతలు ఓకే అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలుపు కోసం ఓ పార్టీ అభ్యర్థి రూ. 30 లక్షలకు పైగా నేరుగా ఓటర్లకే పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎన్నికల ఖర్చు రూ. 50 లక్షల పైమాటేనని అప్పట్లో ప్రచారం జరిగింది. మరో మున్సిపాలిటీలో 900కుపైగా ఓటర్లుండగా అభ్యర్థి నేరుగా రూ. 30 లక్షల వరకు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫేస్ వ్యాల్యూ పనిచేస్తదని..!
గత మున్సిపోల్స్‌లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. వీరంతా మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు కానీ ఎవరికి వారే పోటీలో నిలిచేందుకు పకడ్బందీ ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ టికెట్ మాత్రమే కాదు తమ ఫేస్ వ్యాల్యూ కూడా పనిచేస్తుందన్న నమ్మకంతోనే సదరు నాయకులు పోటీకి కాలుదువ్వుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో వార్డులో 900 ఓట్ల (మధ్య తరహా మున్సిపాలిటీల్లో) వరకే ఉండటంతో 400 ఓట్లు తెచ్చుకోగలిగితే గెలిచినట్లేనని అంటున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా సొంతంగా గెలుస్తామనే లెక్కలు వారి మాటల్లో వినిపిస్తోంది. టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారడమో.. ఇండిపెండెంట్లుగా పోటీ చేయడమో.. ఏదో ఒకటి తప్పదని తమ అనుచరులకు తేల్చిచెప్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చోట్ల (ఒక వార్డులో) ఎన్నికల వ్యయం రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షలకు పైగా ఖర్చయ్యే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
మేయర్, చైర్పర్సన్ కోసం కూడా ఇప్పుడే లెక్కలు
మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు కొందరు నేతలు ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు. ఈ పరిస్థితి టీఆర్ఎస్లో కనిపిస్తోంది. గ్రేటర్ శివారులోని ఓ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఏకంగా పది మందికిపైగా టీఆర్‌ఎస్ నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా లోకల్ మినిస్టర్, ఇతర ముఖ్య నేతలతో నిత్యం టచ్‌లో ఉండేవారే. ఎవరికి హైకమాండ్ ఆశీస్సులు ఉంటాయో తెలియదు కానీ.. అందరూ పోటాపోటీగా పనిచేసుకుంటున్నారు. కార్పొరేటర్ టికెట్ ఖాయమన్న ధీమాతో మేయర్ పీఠంపై గురిపెట్టారు. వీరిలో సగం మందికిపైగా ఇప్పటికే తాము పోటీ చేయాలనుకుంటున్న డివిజన్లలో పలు కార్యక్రమాల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా డివిజన్లలోని కాలనీ, అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు కూడా కొందరు నేతలు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే కాదు మిగతా అన్ని కార్పొరేషన్లు.. గ్రేటర్‌ను ఆనుకుని ఉన్న 15 మున్సిపాలిటీల్లోనూ ఇదే రీతిలో ఆశావహులు ముందుకు కదులుతున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పెద్ద మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే తాము పోటీ చేసేందుకు అనుకూలమనుకుంటున్న రెండేసి వార్డుల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారంలో ఉంది.
ఇవే కాస్ట్లీ ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికల్లో ఒక జనరల్ ఎంపీ స్థానం నుంచి గెలిచిన క్యాండిడేట్ రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేశారని, ఇప్పుడు ఇదే నియోజకవర్గంలోని కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కనీస వ్యయం రూ. 40 కోట్లకు పైగా ఉంటుందని ఆశావహులు అంచనా వేసుకుంటున్నారు. గ్రేటర్ శివారులోని ఒక అసెంబ్లీ సీటుకు పోటీపడ్డ మొత్తం క్యాండిడేట్లు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేశారని, అయితే దాని పరిధిలోని కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్ల ఎన్నికకు అన్నింటికి కలిపి ఇప్పుడు రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఖర్చయ్యే చాన్స్ ఉందని నేతలు భావిస్తున్నారు.
జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అట!
మున్సిపోల్స్‌కు ముందస్తు ఖర్చుపై కొందరు ఆశావహులను ప్రశ్నించగా.. తాము చేసే ఖర్చు ‘జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్’ మాత్రమేనన్నారు. రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీ చేస్తామని, లేకుంటే ఇప్పటికికాకున్నా ముందు ముందైనా ఆయా డివి జన్లు, వార్డుల్లో తమకంటూ కొందరు మనుషు లు ఉంటారన్నారు. ఈ బలం తాము రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడుతుందని మరికొందరు తెలిపారు. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టకుండా ఏదీ సాధించలేమని ఇంకొందరు చెప్పుకొచ్చారు. అవకాశం, అదృష్టం కలిసి వస్తే తమ దశ మరిపోతుందనే నమ్మకంతోనే పెట్టుబడి పెడుతున్నట్టు వారు అన్నారు. గతంలో ఆయా వార్డులు ఎవరికి రిజర్వ్ అయ్యాయి? ఇప్పుడు ఎవరికి రిజర్వ్ అయ్యే అవకాశముంది? అనే అంచనాలు వేసుకొనే రంగంలోకి దిగుతున్నట్లు తెలిపారు. జనరల్ కోటా అయితే తాను, ఉమెన్ కోటా అయితే తన భార్య పోటీలో ఉంటారని, లేకపోతే మరో రిజర్వేషన్ అయితే తమ అనుచరులు బరిలో ఉంటారని, అలాంటప్పుడు స్థానికుల మద్దతు కు ఈ మాత్రం ఖర్చు చేయక తప్పదని వివరించారు.
దావత్‌లు… ముగ్గుల పోటీలు
మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లు ఏ వర్గానికి రిజర్వ్ అవుతాయో తేలకముందే ఇప్పటికే ఒక్కో నేత రూ. 5లక్షల నుంచి 10 లక్షలకుపైగా ఖర్చుచేసినట్లు ప్రచారంలో ఉంది. న్యూ ఇయర్ రోజు స్పెషల్ దావత్‌లు ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు స్థానిక పెద్దలతో, యువకులతో సమావేశమై వరాలు కురిపించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. గల్లీ లీడర్లతోపాటు రాష్ట్ర స్థాయి నేతలతో ఆశావహులు ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉంటున్నారు. టీఆర్ఎస్లో టికెట్ ఆశించేవారు ఎక్కువగా ఉండటంతో.. ముందస్తుగా జనాన్ని తమవైపు తిప్పుకుంటే టికెట్ ఆటోమెటిక్‌గా వస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలోనూ కొందరు నేతలు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కూడా సమీపిస్తుండటంతో ఆ పండుగను కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయాలని, పోటీల పేరిట ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని కొందరు ప్లాన్ చేసుకుంటున్నారు.