టీఆర్ఎస్ను వీడి బీజేపీలు చేరుతున్న ఉద్యమకారులు

టీఆర్ఎస్ను వీడి బీజేపీలు చేరుతున్న ఉద్యమకారులు

ఉద్యమ సమయంలో  టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా చూడవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పోరాడిన వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరడం కేసీఆర్ నియంతృత్వ పాలనకు అద్దం పడుతుంది. ఆత్మగౌరవంతో కష్టపడి రాజకీయాల్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న బహుజన నాయకులు అదే ఆత్మగౌరవం కోసం బీజేపీలో చేరి  కష్టపడి పార్టీని బలోపేతం చేస్తున్నారు. 

పార్టీలో  బడుగు వర్గాలు

తెలంగాణలో సర్వాయి పాపన్న గౌడ్, కొమరం భీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ఆత్మగౌరవ పోరాటాలను కొనసాగించారు.  నిజాం అరాచకాలకు, దొరల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన గడ్డ తెలంగాణ. కనీసం మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వకుండా ఏళ్ల తరబడి నిరీక్షించి భంగపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు కేసీఆర్ దొరకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలను మొదలుపెట్టారు. ఈ పోరాటానికి బీజేపీయే సరైనది అనడానికి  పలు కారణాలున్నాయి. బీజేపీలో మొదటి తరం నుంచి పనిచేస్తున్న నాయకులను ఎప్పుడూ విస్మరించలేదు. బీజేపీ   కోసం పనిచేసిన దళిత నాయకుడు  శ్రీ బంగారు లక్ష్మణ్​ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయడం, బీసీ నాయకులుగా ఉన్న బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా చేయడం, పార్టీలో ఉన్నత స్థానాలు కల్పించడం బీజేపీలో సామాజికతకు ప్రాధాన్యాన్ని తెలుపుతున్నది.  ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. పార్టీ పార్లమెంటు బోర్డ్ మెంబర్ గా,  పార్టీలో బీసీలకు లభిస్తున్న ప్రాతినిధ్యాన్ని తెలుపుతున్నది.  కేంద్ర క్యాబినెట్​లో  అత్యధికంగా ఎస్సీలకు, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన పార్టీగా బీజేపీ కొత్త రాజకీయ సామాజిక న్యాయాన్ని  చూపించిందనడంలో అతిశయోక్తి లేదు. స్వతంత్ర భారత చరిత్రలో దేశ రాష్ట్రపతిగా ఒక ఎస్సీ ని, ఒక ఎస్టీ మహిళని,  ఒక మైనార్టీని, చేసిన ఘనత బీజేపీది. 

ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యం కూడా..

బండి సంజయ్ పాదయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు చాలా చురుకుగా పాల్గొంటున్నారు. సరికొత్త ఆలోచనలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ  కృషి చేస్తుందనే విశ్వాసం జనబాహుళ్యంలో  బండి సంజయ్​ యాత్ర తీసుకురాగలిగింది. మరోవైపు,  పార్టీ క్యాడర్​ను పెంచడంలోనూ సంజయ్​ యాత్ర ఊతమిచ్చింది. బీజేపీలో ఉత్తేజం నింపడానికి, కేసీఆర్ నియంతృత్వ పాలనపై పోరాటం చేయడానికి బండి సంజయ్ సంగ్రామ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతున్నది.   ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ పనిచేస్తుందనే విశ్వాసాన్ని బండి సంజయ్​ కల్పించగలిగారు.   ప్రతి గ్రామం ప్రజలు బండి సంజయ్ కి తమ గోడును వినిపిస్తూ మార్పు కోసం తాము కదం తొక్కుతామని చెప్తున్నారు. ఈ సంగ్రామ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో  మార్పుతో పాటు, సామాజిక న్యాయం దిశగా సాగుతున్నది. ఈ యాత్రలో బీసీల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజులు, గౌడ్లు, గొల్ల కురుమలు, పద్మశాలీలు, మున్నూరు కాపులు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. కేవలం రెండు మూడు సీట్లున్న బీజేపీ, మెజారిటీ సీట్లు సాధించి  ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా  బండి సంజయ్  యాత్రలు ప్రజాదరణను పెంచుతున్నాయి. 

విద్యార్థులు, నిరుద్యోగులే క్యాడర్​గా..

ఇన్ని రోజులు బీసీలను, ఎస్సీలను కమ్యూనిస్టు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు  జెండాలు మోసే కార్యకర్తల లాగే చూశారు. కానీ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చి పార్టీని విస్తరిస్తున్నారు.   ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళితే కూడా పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ వ్యూహాలకు చెక్కు పెడుతూ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బస్సు యాత్రలకు ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు మూడు నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా కసరత్తు చేయడం మంచి పరిణామం.  క్యాడర్​లో నూతన ఉత్తేజం నిండి ఉంది. తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థుల్లో  మార్పు తేవాలనే కసి ఉంది.  బీజేపీ ప్రత్యామ్నాయ ఎదుగుదలకు  వాళ్లే బలమైన అస్త్రాలు.

సంజయ్​ ప్రోత్సాహం

తెలంగాణ రాష్ట్ర సాధనకై , పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన విద్యార్థి నాయకులకు  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంచి  ప్రోత్సాహం అందిస్తున్నారు.  జిల్లాల స్థాయిలో కొత్త రాజకీయ తరాన్ని ప్రోత్సహిస్తున్నారు.  యువ నాయకత్వాలను ఎంత ప్రోత్సహిస్తే  బీజేపీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారే అవకాశాలు ఉంటాయి.  మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. బీజేపీ  అందరినీ కలుపుకుంటూ బీసీల, ఎస్సీల నాయకులకు ఎక్కడికక్కడ తగిన స్థానాన్ని కల్పిస్తూ సాగుతున్నది. ఈ రాజకీయ ధర్మ పోరాటంలో బీజేపీ విజయం సాధించడం అనివార్యం. ఎందుకంటే, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి. బీజేపీ సామాజిక తెలంగాణ దిశగా వేస్తున్న అడుగులే బీజేపీ విజయాన్ని సూచిస్తున్నాయని చెప్పాలి.


బీజేపీకి బడుగు నేతల బలం

మునుగోడులో గెలుపోటములు పక్కన పెడితే బీజేపీ  బీసీ ఎస్సీ ఎస్టీ నేతల కృషి కాదనలేనిది. బడుగుల దగ్గరకు బీజేపీని తీసుకుపోగలిగారు. అనేక అక్రమాలు జరిపి టీఆర్​ఎస్​ గెలిచినా.. బీజేపీని మునుగోడు బడుగులు బాగానే ఆదరించారనే విషయం రాజ్​గోపాల్​రెడ్డి సాధించిన 87 వేల ఓట్లు చూస్తే తెలుస్తుంది. మునుగోడులో   స్వయాన వివేక్​ వెంకటస్వామి ఎన్నికల ఇంచార్జ్​గా పనిచేశారు. తెలంగాణలో  వివేక్ వెంకటస్వామికి అన్ని సామాజికవర్గాలతో సత్సంబంధాలు,  సాన్నిహిత్యమూ ఉన్నది. అందరి ఆమోదనీయత ఉన్న అరుదైన నాయకుడు ఆయన. తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడిన నాయకుడుగా వివేక్  తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న  ఉద్యమ నాయకుడు కూడా.  వివేక్​ చురుకైన పొలిటికల్​ యాక్టివిటీ ఇవాళ బీజేపీ బలోపేతానికి బాగా ఉపయోగపడుతున్నది.  అలాగే, రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలకు పెద్ద దిక్కుగా  డాక్టర్ లక్ష్మణ్,  ఈటల రాజేందర్ , బూర నర్సయ్య గౌడ్, ఆచారి వంటి అనేక మంది బీసీ నేతలు బీజేపీకి అపార సంపదగా మారారు.  బీసీ సంఘాలతో సత్సంబంధాలు,  బీసీ ఓటు బ్యాంకు ను ఏకీకృతం,  సమీకృతం చేయడంలో వారు చేస్తున్న కృషి కాదనలేనిది.