రూ.700 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన దైనిక్ భాస్కర్

రూ.700 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన దైనిక్ భాస్కర్

న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ దిన పత్రిక దైనిక్ భాస్కర్‌కు చెందిన కీలకమైన ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. ఈ దాడుల్లో దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల ఆదాయంపై ఆరేళ్లుగా పన్ను చెల్లించడం లేదని కనుగొన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూల్స్‌‌ను కూడా దైనిక్ భాస్కర్ ఉల్లంఘించిందని పేర్కొంది. దైనిక్ భాస్కర్‌కు చెందిన ప్రమోటర్లు, ముఖ్యమైన ఉద్యోగుల నుంచి 26 లాకర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. 

‘మేం చేసిన దాడుల్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. దైనిక్ భాస్కర్ తమ ఉద్యోగుల పేర్ల మీద పలు కంపెనీలను నడుపుతోంది. ఈ కంపెనీలను బోగస్ ఖర్చులను సృష్టించడంతోపాటు నిధులను మళ్లించడానికి వాడుతున్నట్లు బయటపడింది. కొందరు ఎంప్లాయిస్‌‌‌ను షేర్‌హోల్డర్లు, డైరెక్టర్లుగా చూపిస్తున్నారు. అయితే ఈ విషయం ఉద్యోగులకు తెలియదు’ అని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ముంబై, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, జైపూర్, కోర్బా, నోయిడా, అహ్మదాబాద్ నగరాలతో సహా 32 చోట్ల దైనిక్ భాస్కర్ విస్తరించి ఉంది. ఈ గ్రూప్ వివిధ రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. ప్రధానంగా మీడియా, పవర్, టెక్స్‌టైల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి.