
ముంబై: మహేశ్ భూపతితో తనది అన్నదమ్ముల అనుబంధమని ఇండియా వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ అన్నాడు. ఇండియన్ టెన్నిస్ ముఖ చిత్రంగా నిలిచిన పేస్–భూపతి జర్నీకి సంబంధించి ‘బ్రేక్ పాయింట్’ అనే పేరుతో త్వరలో ఓ డాక్యుమెంటరీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పేస్ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ‘ నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు శ్రీలంకలో ఏషియన్ చాంపియన్‌షిప్స్ ఆడుతుండగా మహేశ్‌ను తొలిసారి చూశా. తనని చూడగానే మేమిద్దరం కలిసి వింబుల్డన్ గెలుస్తామని అనిపించింది. దాంతో ఓ 15 నిమిషాలు మహేశ్ ఆటను పరిశీలించా. కోర్ట్ నుంచి బయటకు వచ్చాక..తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను పరిచయం చేసుకున్నా. వింబుల్డన్ గెలుద్దామా అని తనని అడిగాను. నా మాటలకు గట్టిగా నవ్విన భూపతి పిచ్చిపట్టిందా అని అడిగాడు. అవును నాకు పిచ్చే అన్నా. ఆ తర్వాత జరిగిందంతా అందరికి తెలిసిందే’ అని పేస్ చెప్పుకొచ్చాడు.