ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు ఇలా!

ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు ఇలా!

బిజినెస్ డెస్క్, వెలుగు:  ఇంకొన్ని  రోజుల్లో ఆర్థిక సంవత్సరం 2021–22 ముగియనుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌ మొత్తంలో తాము చేసిన ఏయే ఖర్చులపై ట్యాక్స్ బెనిఫిట్స్‌‌ పొందొచ్చొ ట్యాక్స్ పేయర్లు లెక్కలేస్తుంటారు. డిడక్షన్లను, మినహాయింపులను పొందడానికి ప్రయత్నిస్తుంటారు. లెక్కల  బుక్ బయటకు తీసే ముందు ఏయే  ఖర్చులపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయడం కంటే, చేసిన ఖర్చులు, ఇన్వెస్ట్‌‌మెంట్లపై ట్యాక్స్‌‌ ప్రయోజనాలను పొందడం బెటర్‌‌‌‌. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్ల ముందు కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌, పాత ట్యాక్స్ సిస్టమ్‌‌ రెండూ అందుబాటులో ఉన్నాయి. పాత సిస్టమ్‌‌ ఎంచుకుంటే ట్యాక్స్ శ్లాబ్ రేట్లు ఎక్కువగా ఉన్నా, సెక్షన్‌‌ 80 సీ, 80 డీ, సెక్షన్‌‌ 24 సీ కింద  డిడక్షన్లను పొందడానికి వీలుంటుంది. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌లో  ట్యాక్స్ శ్లాబ్‌‌ రేట్లను తగ్గించారు. అలానే చాలా డిడక్షన్లను తీసేశారు. 

పాత ట్యాక్స్ సిస్టమ్‌‌లో పొందే డిడక్షన్లు..

స్కూల్ ఫీజులపై ..
పిల్లల ఫీజుల కోసం చేసే ఖర్చులను సెక్షన్‌‌ 80సీ కింద  ట్యాక్స్ డిడక్షన్‌‌గా పొందొచ్చు.  మ్యాక్సిమమ్‌‌  ఇద్దరు పిల్లల కోసం  గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిడక్షన్‌‌ దక్కించుకోవచ్చు. డొనేషన్లు, డెవలప్‌‌మెంట్‌‌ ఫీజులపై ట్యాక్స్ డిడక్షన్లను పొందలేము. పేరెంట్స్ ఇద్దరూ ట్యాక్స్ పేయర్లయితే స్కూల్ ఫీజులను చెల్లించిన వారే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఉంటుంది. ఉదాహరణకు ఒక తండ్రి తన కూతురి కోసం 2021–22 లో రూ. 1.8 లక్షలను స్కూల్ ఫీజు కింద కట్టాడని అనుకుందాం. ఇందులో రూ. 1.5 లక్షలను  సెక్షన్‌‌ 80 సీ కింద డిడక్షన్ పొందొచ్చు. మిగిలిన రూ.30 వేలను అతని భార్య క్లయిమ్ చేసుకోవడానికి అవ్వదు.  అదే ఇద్దరు పిల్లల కోసం తల్లి, తండ్రి ఇద్దరూ ఫీజులు కడితే,  ఈ ఖర్చులను వీరు సపరేట్‌‌గా తమ ట్యాక్స్ రిటర్న్స్‌‌లో డిడక్షన్‌‌గా ఫైల్ చేసుకోవచ్చు.  
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం..
ట్యాక్స్ పేయర్లు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటే ఈ పాలసీల కోసం చెల్లించే ప్రీమియంను ట్యాక్స్‌‌ అమౌంట్‌‌ను తగ్గించుకోవచ్చు.   రెన్యువల్ ప్రీమియంను  కూడా సెక్షన్ 80 సీ కింద ట్యాక్స్ అమౌంట్‌‌ నుంచి తగ్గించుకోవచ్చు. కొన్ని ప్రీమియంలను చెల్లించకపోవడం వలన పాలసీ టెంపరరీగా క్లోజయితే, ఇటువంటి పాలసీని తిరిగి యాక్టివ్ చేయడానికి చెల్లించే ప్రీమియంను కూడా ట్యాక్స్ డిడక్షన్‌‌గా పొందొచ్చు. ఇప్పటి వరకు  చెల్లించని మొత్తం ప్రీమియంల అమౌంట్‌‌ను కూడా డిడక్షన్‌‌గా పొందొచ్చు. కానీ, ఈ అమౌంట్ గరిష్టంగా రూ. 1.5 లక్షలు మాత్రమే ఉండాలి.  టెర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌, ఎండోమెంట్‌‌, యూనిట్‌‌ లింక్డ్‌‌ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌‌ (యులిప్స్‌‌) వంటి అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్లాన్స్‌‌పైనా ట్యాక్స్ డిడక్షన్స్ పొందొచ్చు. ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం కట్టిన  పాలసీల మెచ్యూరిటీ అమౌంట్‌‌పై మాత్రం ట్యాక్స్ వేస్తున్నారు. ఈ రూల్‌‌ కిందటేడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ డేట్‌‌ తర్వాత తీసుకున్న పాలసీలకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. 

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం
కరోనా తర్వాత  హెల్త్ ఇన్సూరెన్స్‌‌లు తీసుకోవడం పెరిగింది. హెల్త్‌‌ ఇన్సూరెన్స్ పాలసీల కోసం చెల్లించిన ప్రీమియంను  సెక్షన్‌‌ 80 డీ కింద ట్యాక్స్‌‌ అమౌంట్ నుంచి తగ్గించుకోవచ్చు. తమ కోసం, స్పౌజ్‌‌, పిల్లల (ఆధారపడిన) హెల్త్ పాలసీలు తీసుకుంటే ప్రీమియంల కింద గరిష్టంగా రూ. 25 వేల వరకు (ఏజ్‌‌ 60 ఏళ్ల లోపు అనుకుంటే) డిడక్షన్ పొందొచ్చు. పేరెంట్స్‌‌ కోసం హెల్త్ పాలసీ తీసుకుంటే అదనంగా మరో  రూ. 25 వేలను ట్యాక్స్ డిడక్షన్‌‌గా పొందొచ్చు. మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ కూడా అయితే  పాలసీ ప్రీమియంల కింద రూ. 50 వేల వరకు ట్యాక్స్ డిడక్షన్ అందుబాటులో ఉంది. మీరు, మీ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్లే అయితే ప్రీమియం కింద గరిష్టంగా రూ. లక్షను ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌గా పొందొచ్చు. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయి ఉండి ఎటువంటి హెల్త్ పాలసీ లేకపోతే, మెడికల్ ఖర్చుల్లో రూ. 50 వేల వరకు ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌ను పొందొచ్చు. వీటితో పాటు మెడికల్ చెకప్‌‌ల కోసం చేసిన ఖర్చులో గరిష్టంగా రూ. 5 వేల ట్యాక్స్ డిడక్షన్‌‌ను దక్కించుకోవచ్చు.  కానీ, ఈ డిడక్షన్ అమౌంట్ పైన పేర్కొన్న రూ. 25 వేలు లేదా రూ. 50 వేల (దేనికి అర్హత పొందితే అది) ట్యాక్స్ డిడక్షన్‌‌లో కలిసే ఉంటుంది. 

ఎడ్యుకేషన్ లోన్‌‌..
ఎడ్యుకేషన్‌‌ లోన్‌‌ తీసుకున్నందుకు చెల్లించే వడ్డీపై సెక్షన్‌‌ 80ఈ కింద ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. కానీ, అసలుపై మాత్రం ఎటువంటి డిడక్షన్ లేదు. ఎడ్యుకేషన్‌‌ లోన్‌‌పై వడ్డీ యాడ్‌‌ అవుతున్న ఏడాది నుంచి ఎనిమిదేళ్ల వరకు ఈ ట్యాక్స్ డిడక్షన్‌‌ను పొందొచ్చు. 

ఈపీఎఫ్‌‌..
ఉద్యోగులు చేసే పీఎఫ్‌‌ కంట్రిబ్యూషన్స్‌‌పై సెక్షన్‌‌ 80 సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఉద్యోగుల బేసిక్ శాలరీలో 12 శాతాన్ని పీఎఫ్‌‌గా కట్‌‌ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇంతే అమౌంట్‌‌ను ఎంప్లాయర్‌‌‌‌ కూడా ఉద్యోగి పీఎఫ్‌‌ స్కీమ్‌‌కు యాడ్ చేస్తాడు. కానీ, ఎంప్లాయర్‌‌‌‌ కంట్రిబ్యూషన్స్‌‌పై ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు.

హోమ్‌‌‌‌ లోన్‌‌ తీర్చడంలో..
మీరేదైనా  హోమ్ లోన్ తీసుకొని ఉంటే, ఈ లోన్‌‌ అసలును తీర్చడానికి చేసిన ఖర్చులను ట్యాక్స్ అమౌంట్ నుంచి తగ్గించుకోవచ్చు. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌లో ఈఎంఐల కింద ఎంత లోన్ అమౌంట్‌‌(అసలు) ను తీర్చారో మీ  లెండర్‌‌‌‌ను అడిగితే తెలుస్తుంది. హోమ్‌‌ లోన్‌‌పై చెల్లించే వడ్డీని కూడా సెక్షన్‌‌ 24  కింద ట్యాక్స్ అమౌంట్‌‌ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గరిష్టంగా రూ. 2 లక్షలు మాత్రమే ట్యాక్స్ డిడక్షన్‌‌గా పొందడానికి వీలుంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ కేటగిరీలో ఇల్లు కొంటే హోమ్‌‌ లోన్లపై చెల్లించే వడ్డీపై అదనంగా రూ. 1.5 లక్షలను ట్యాక్స్ డిడక్షన్‌‌గా పొందొచ్చు.