
వనపర్తి జిల్లా సరళాసాగర్వాగుపై మంగళవారం సాయంత్రం ఘటన
ఇంకా దొరకని ఆచూకీ
వనపర్తి / మదనాపురం, వెలుగు : వనపర్తి జిల్లాలో బైక్పై సరళా సాగర్ వాగు దాటుతున్న ఓ ప్రైవేట్ లెక్చరర్ వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఘటన జరిగి 36 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆయన ఆచూకీ దొరకలేదు. చెప్పులు, బైక్, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనాపూరం ఎస్సై కథనం ప్రకారం..ఆత్మకూరు మున్సిపాలిటీకి చెందిన ఆకుల కురుమూర్తి (30) కొత్తకోట లోని నివేదిత ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ . మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఆత్మకూరుకు బైక్ పై వస్తున్నాడు. మదనాపురం దాటిన తర్వాత సరళాసాగర్ వాగు రోడ్యాంపై సరళా సాగర్,శంకర సముద్రం రిజర్వాయర్ ల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేశాడు. అలాగే ముందుకు పోవడంతో మోటార్ సైకిల్ అదుపు తప్పి వరదలో కొట్టుకుపోయాడు. వెనక వస్తున్న వాళ్లు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కొద్దిసేపు వెతకగా ఆచూకీ లభించలేదు. రాత్రి కావడంతో గాలింపు ఆపేశారు. బుధవారం గాలింపు మొదలుపెట్టగా కురుమూర్తి బ్యాగు, ఐడెంటిటీ కార్డు దొరికింది. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జాడ తెలియలేదని ఎస్సై తెలిపారు.
బ్రిడ్జి ఉంటే ఇలా జరిగేదా?
వాగుపై బ్రిడ్జి కట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులంటున్నారు. పదేండ్ల కింద ఉమ్మడి ఏపీలో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయగా, కాంట్రాక్టర్ తనకు గిట్టుబాటు కావడం లేదని వదిలేశాడు. మళ్లీ ఏడాది కింద మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేయగా, పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ఏవో కారణాలతో ఆపేశాడు. వెంటనే వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.
స్టూడెంట్స్తో పనులు చేయించిన టీచర్లు
చదువు చెప్పి ప్రయోజకుల్ని చేయాల్సిన టీచర్లే పిల్లలతో పనులు చేయించారు. స్కూల్ ఆవరణలో వాన నీరు నిలవకుండా మట్టిపోసి చదును చేయించారు. ఈ ఘటన హైదరాబాద్లోని శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు స్కూల్ ఆవరణలో వరద నీరు నిలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం టీచర్లు ఐదో తరగతికి చెందిన నలుగురు పిల్లలకు తట్ట, పార ఇచ్చి నీరు నిలుస్తున్న చోట మట్టి పోయించారు. మిగిలిన పిల్లలు క్లాసులు వింటుండగా ఈ నలుగురు మాత్రం పనిచేస్తూ కనిపించారు.
- వెలుగు, గచ్చిబౌలి