అజయ్ దేవగన్ 'భోలా'కు కాపీరైట్ సెగ.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు!

అజయ్ దేవగన్ 'భోలా'కు కాపీరైట్ సెగ.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు!

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన 'భోలా' (2023) సినిమా చుట్టూ ఇప్పుడు కాపీరైట్ వివాదం ముసురుకుంది. కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' (2019) మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్ తన స్వీయ దర్శకత్వంలో'భోలా'గా రీమేక్ చేశారు. అయితే, ఈ సినిమా విడుదలైన మూడేళ్ల తర్వాత, కాపీరైట్ , రీమేక్ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బాంబే హైకోర్టులో దావా వేసింది. ఇప్పుడు ఈ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

వివాదం ఎక్కడ మొదలైంది?

ఈ వివాదం వెనుక భారీ ఆర్థిక లావాదేవీల వైఫల్యం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మధ్య రీమేక్ హక్కుల కోసం మార్చి 2023లో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, డ్రీమ్ వారియర్ సంస్థకు నిర్ణీత రుసుమును వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. అయితే, కేవలం రూ.1 కోటి ప్లస్ జీఎస్టీ మాత్రమే చెల్లించారని, మిగిలిన బకాయిలు నిలిచిపోయాయని తమిళ నిర్మాతలు ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత అజయ్ దేవగన్ ఎఫ్ ఫిలింస్ ఎల్‌ఎల్‌పీని కూడా కలుపుకుంటూ ఏప్రిల్ 2023 లో మరో  ఒప్పందం జరిగింది. దీని ద్వారా హక్కులను పంచుకున్నారు.

నోటీసులు - హక్కుల రద్దు

వరుసగా రిమైండర్లు పంపినా స్పందన లేకపోవడంతో, అక్టోబర్ 2024లో డ్రీమ్ వారియర్ సంస్థ రూ.4 కోట్ల బకాయిలు, వడ్డీ చెల్లించాలని నోటీసు ఇచ్చింది. 30 రోజుల్లో చెల్లించకపోతే ఒప్పందం రద్దవుతుందని హెచ్చరించింది. నవంబర్ 27, 2024 తర్వాత ఒప్పందం రద్దయిందని, ఇప్పుడు 'భోలా' రీమేక్, ఎక్స్‌ప్లాయిటేషన్ హక్కులన్నీ తిరిగి తమకే చెందుతాయని డ్రీమ్ వారియర్ వాదిస్తోంది.

కోర్టులో వాదనలు

ఈ కేసును మార్చి 22, 2026న కమర్షియల్ ఐపీ సూట్‌గా ఫైల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ సినిమా వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ఇంజంక్షన్ ఆర్డర్ కోరారు. అయితే, ప్రతివాదులైన అజయ్ దేవగన్ సంస్థ, రిలయన్స్ ఈ కేసు ముంబై కోర్టు పరిధిలోకి రాదని, చెన్నై కోర్టులోనే తేల్చుకోవాలని వాదిస్తున్నారు. దీంతో జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్ ధర్మాసనం ప్రస్తుతం కేసు తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు డ్రీమ్ వారియర్‌కు అనుకూలంగా తీర్పునిస్తే, 'భోలా' ప్రసారాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.