MTV మ్యూజిక్ మూసివేత: ముగింపునకు చేరిన 40 ఏళ్ల ప్రస్థానం.. లెజెండరీ సంస్థకు ఏమైంది..

MTV మ్యూజిక్ మూసివేత: ముగింపునకు చేరిన 40 ఏళ్ల ప్రస్థానం.. లెజెండరీ సంస్థకు ఏమైంది..

ప్రపంచ సంగీత ప్రపంచంలో యువతతో పాటు అన్ని వయస్సుల వారిని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అలరించిన MTV మ్యూజిక్ ఛానెల్స్‌ ప్రయాణం ముగుస్తోంది. కంపెనీ యూకేలోని MTV మ్యూజిక్, MTV 80s, MTV 90s, క్లబ్ MTV, MTV లైవ్ ఛానెళ్లు డిసెంబర్ 31 నాటికి అధికారికంగా మూతపడతాయని పారామౌంట్ గ్లోబల్ ఇటీవల నివేదించింది. ఈ ఛానెల్స్ కోట్లాది ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాదు.. ఒక సాంస్కృతిక గుర్తింపుగా నిలిచాయి. కొత్త తరం కళాకారులను పరిచయం చేస్తూ, ఫ్యాషన్, పాప్ కల్చర్‌లో కొత్త ట్రెండ్లను సృష్టించాయి.

ఎంటీవీ ప్రధాన ఛానెల్ మాత్రం కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఆ ఛానెల్లో ఎక్కువగా రియాలిటీ షోలు ప్రసారం చేస్తున్నారు. అందువల్ల సంగీత అభిమానులకు ఇది పెద్ద నిరాశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సంస్థ కార్యకలాపాలు భారతదేశంలోనూ 1996 నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో యువతను ఇది ఉర్రూతలూగించింది. నిరంతరం మ్యూజిక్ వీడియోలు, రియాలిటీ షోల మిశ్రమంతో యువ ట్రెండ్స్, ఫ్యాషన్, స్లాంగ్‌ని ప్రభావితం చేసింది. 2016లో MTV ఇండీస్ స్థానంలో MTV బీట్స్ అనే 24 గంటల సంగీత ఛానెల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి MTV ఇండియా ఫోకస్ ప్రధానంగా రియాలిటీ షోలపై పెరిగింది. అయితే దీనిని కూడా క్లోజ్ చేస్తారా అనే అంశంపై క్లారిటీ లేదు ప్రస్తుతానికి.

ప్రస్తుతం ఎంటీవీ మ్యూజిక్ కంపెనీ సేవలు యూకే, ఐర్లాండ్‌లో మూతపడటం స్టార్ట్ అయ్యి ఆ తర్వాత.. యూరప్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా వ్యాపించనున్నట్లు తెలుస్తోంది. పోలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ దేశాల్లో కూడా మ్యూజిక్ ఛానెల్స్ కూడా మూతపడనున్నాయని తెలుస్తోంది. దాదాపు 4 దశాబ్ధాల తర్వాత కంపెనీ ఇంత గడ్డు పరిస్థితిని చేరుకుంది. అయితే కంపెనీ మూసివేతపై సోషల్ మీడియాలో యూజర్లు స్పందిస్తున్నారు. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ వీడియోలకు యూట్యూబ్, స్పాటిఫై, టిక్‌టాక్ వచ్చిన తర్వాత మార్కెట్ దాదాపు మాయమైందని ఒక యూజర్ అభిప్రాయపడ్డారు.