
- శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకే అధిక సీట్లు కేటాయించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లు ఐకమత్యంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో ముదిరాజ్‌ల వాటా జనాభాకు అనుగుణంగా ఇవ్వాలని కోరారు. జీఓ నెంబర్ 15 ప్రకారం ముదిరాజ్‌లను బీసీ ( డీ ) నుంచి బీసీ( ఏ) లోకి మార్చాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెబోయిన అశోక్, జిల్లా అధ్యక్షుడు చిల్లా సహాదేవ్, సంఘం లీడర్లు పాల్గొన్నారు.