మైనపు బొమ్మల మ్యూజియం కొన్న బొమ్మల కంపెనీ లెగో

మైనపు బొమ్మల మ్యూజియం కొన్న బొమ్మల కంపెనీ లెగో
  • కన్సార్టియంగా కొనుగోలు
  • డీల్‌ విలువ రూ. 51,691 కోట్లు
  • పిల్లలు ఆడుకునే బిల్డింగ్ బ్లా క్స్ తయారీలో లెగో కంపెనీనే టాప్

లండన్:అచ్చు గుద్దినట్టు మనిషిని పోలిన మైనపు బొమ్మలను తీర్చిదిద్దడంలో మేడమ్ టుస్సాడ్స్‌‌కు ఎవరూ సాటిరారు. నిజంగా మనిషిని చూస్తున్నామా..? అన్నట్టు ఉంటాయి ఆ మైనపు బొమ్మలు. ప్రపంచవ్యాప్తంగా దీని కీర్తి ప్రతిష్టలు అంతా ఇంతా కాదు. టాలీవుడ్ సెలబ్రిటీ మహేష్‌‌ బాబు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. విశ్వసుందరి ఐశ్వర్య రాయ్.. ఇలా ఒక్కరేంటి ఎందరో సెలబ్రిటీల మైనపు బొమ్మలు మేడమ్ టుస్సాడ్స్‌‌లో దర్శనమిస్తాయి.  ఇప్పుడు ఈ మేడమ్ టుస్సాడ్స్‌‌ చేతులు మారిపోయింది. మేడమ్ టుస్సాడ్స్ ఓనర్ అయిన బ్రిటన్ మెర్లిన్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్‌‌ను చిన్న పిల్లల బొమ్మల తయారీదారు లెగో ఓనర్ కిర్కిబీతో కలిసి ఓ కన్సార్టియం కొనుగోలు చేసింది. మేడమ్ టుస్సాడ్స్ ఓనర్‌‌‌‌ను కొన్న ఈ కన్సార్టియంలో అమెరికా ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ బ్లాక్‌‌స్టోన్, కెనడియన్ పెన్షన్ ఫండ్ సీపీపీఐబీ ఉన్నాయి. అప్పులతో కలిపి మొత్తం 590 కోట్ల పౌండ్లకు అంటే రూ.51,691 కోట్లను చెల్లించింది ఆ కన్సార్టియం. అప్పులు లేకుండా అయితే ఈ డీల్ విలువ 500 కోట్ల పౌండ్లు.

ఒక్కో షేరుకు 4.55 పౌండ్స్​….

2005లో లెగోల్యాండ్ పార్క్స్‌‌ను లండన్ లిస్టెడ్ గ్రూప్‌‌కు అమ్మేయడంతో ఇప్పటికే కిర్కీబీకి మెర్లిన్‌‌లో 30 శాతం వాటాలున్నాయి. ఒక్కో షేరుకు 4.55 పౌండ్స్​ను కన్సార్టియం బిడ్ వెహికిల్ బెర్కిలీ, మెర్లిన్‌‌కు క్యాష్ రూపంలో ఆఫర్ చేసింది.  ఇది గురువారం స్టాక్ ముగింపు ధర కంటే ఎక్కువ. ‘లొకేషన్ బేస్‌‌లో, ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌లో మెర్లిన్‌‌ గ్లోబల్‌‌ లీడర్‌‌‌‌గా ఉంది. ప్రత్యేకమైన బ్రాండ్ పోర్ట్‌‌ఫోలియోలతో, 25 దేశాల్లో, 4 ఖండాల్లో కస్టమర్లకు సేవలందిస్తోంది’ అని మెర్లిన్ జాన్ సుందర్‌‌‌‌ల్యాండ్ చెప్పారు. ఈ ఆఫర్‌‌‌‌ మెర్లిన్ షేర్‌‌‌‌హోల్డర్స్‌‌కు ఒక అవకాశమని, ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌‌లో వారి ఇన్వెస్ట్‌‌మెంట్లకు ప్రతిఫలం పొందవచ్చని మెర్లిన్ స్వతంత్ర డైరెక్టర్లు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కంబైన్డ్ సంస్థ కొత్త వృద్ధి బాటలోకి ప్రయాణించడానికి ఈ కొనుగోలు ఉపయోగపడుతోందని కిర్కిబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సోరెన్ థోరప్ అన్నారు. మెర్లిన్‌‌ 1999లో ఏర్పాటు చేయగా.. 2013లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌‌లో లిస్ట్ అయింది. 2018లో ఈ బ్రిటీష్ గ్రూప్ 1.65 బిలియన్ పౌండ్ల విక్రయాలను బుక్ చేసింది.