మరింత బలపడనున్న బ్యాంకులు .. క్యూ4లో భారీ లాభాలకు చాన్స్​

మరింత బలపడనున్న  బ్యాంకులు ..  క్యూ4లో భారీ లాభాలకు చాన్స్​

న్యూఢిల్లీ :  ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌లో బ్యాంకింగ్ రంగం సత్తా చాటే అవకాశం ఉంది.  ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీలు) మొత్తం లాభం పెరగడంతోపాటు మొండి బకాయిలు మరింత తగ్గుతాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. క్రెడిట్​గ్రోత్​ కూడా మరింత పెరుగుతుందని అంటున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వీటి లాభం రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్టేట్​ బ్యాంక్​  మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేల కోట్లకుపైగా ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చని సంస్థ సీనియర్​ ఆఫీసర్ ఒకరు అన్నారు.  2022 ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలంలో రూ. 31,675.98 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా భారీ సంఖ్యలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్​పీఏలు తగ్గుదల, స్లిపేజ్‌‌‌‌లు కంట్రోల్​లో ఉండటం, క్రెడిట్ గ్రోత్  రెండంకెలు దాటడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు ఇందుకు కారణాలు.  2022–-23 మొదటి తొమ్మిది నెలలకు, మొత్తం 12 పీఎస్​బీలు రూ. 70,166 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. ఇది కిందటి సంవత్సరంతో పోలిస్తే  43 శాతం పెరిగింది.  పీఎస్​బీలు నాలుగో క్వార్టర్​లో రూ. 30 వేల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది.

పీఎన్​బీకి మాత్రమే నష్టం...

పీఎస్​బీలు మొదటి క్వార్టర్​లో దాదాపు రూ.15,306 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్– మార్చి క్వార్టర్​లో లాభాలను పెంచుకున్నాయి.  ఎస్‌‌బీఐ అత్యధికంగా 68 శాతం గ్రోత్​తో రూ.14,205 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పెరుగుతున్న డిపాజిట్ రేట్లు, ‘కాసా’ అకౌంట్ల తగ్గుదల కారణంగా అన్ని బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్‌‌ తగ్గొచ్చని సాహా చెప్పారు.  ఆర్​బీఎల్​, ఇండస్​ఇండ్​బ్యాంక్,  ఐసీఐసీఐ బ్యాంకులు కూడా బలమైన లాభదాయకతను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.   సిటీ బ్యాంక్  పోర్ట్‌‌ఫోలియో కొనుగోలు వల్ల యాక్సిస్ బ్యాంక్​కు ఈసారి నష్టాలు ఎదురుకావొచ్చు. మూడో క్వార్టర్​లో ప్రైవేట్ బ్యాంకులు లాభాలు వార్షికంగా 33 శాతం పెరిగి రూ.36,512 కోట్లకు చేరుకున్నాయి. బంధన్ బ్యాంక్,  యెస్ బ్యాంక్ మినహా అన్ని ప్రైవేట్ బ్యాంకులు క్యూ3లో నికర లాభాలను పెంచుకున్నాయి.