
కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఆలయంలో వంటపని చేసే యువకుడు చిరుతపులి బారిన పడి మరణించాడు. కొప్పల్ జిల్లాలోని దోద్దీరప్ప గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గంగావతి తాలూకాలోని ఆదిశక్తి ఆలయంలో వంట పని, గోశాల పశువులను చూసుకునే హులిగేష్ (24) అనే యువకుణ్ని చిరుత దాడి చేసి చంపింది. గోశాల వద్ద నిద్రిస్తున్న యువకుణ్ని చిరుత దాడి చేసి, అతన్ని నోట కరుచుకుని గుహలోకి తీసుకెళ్లింది. గుహలోనే చంపేసి అతని గొంతు, కుడి కాలు తొడను తినేసింది. బుధవారం రాత్రి గోశాల కాపలాకు వెళ్లిన హులిగేష్.. ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కోసం వెతకగా.. చిరుతపులి దాడి చేసి, చంపినట్టుగా స్థానికులు కనుగొన్నారు. ఇటీవల చిరుత బెడద ఎక్కువై నెల రోజుల్లోనే ఇదే దేవస్థానం వద్ద ఇద్దరు మహిళలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనలు జరిగాయి. కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.