ఆ వేంకటేశ్వరుడే.. పులి నుంచి పిల్లోడిని కాపాడాడా.. కాలి బాటలో ఏం జరిగింది ?

ఆ వేంకటేశ్వరుడే.. పులి నుంచి పిల్లోడిని కాపాడాడా.. కాలి బాటలో ఏం జరిగింది ?

కొన్ని అద్బుతాలు.. విచిత్రాలు నమ్మటానికి టైం పట్టొచ్చు.. జరిగిన తర్వాత మాత్రం అద్భుతం అనక మానం.. తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే కోట్లాది మంది భక్తులకు విశ్వాసం.. భక్తితో కొలిస్తే.. మొక్కితే తీరని బాధలు అంటూ ఏమీ ఉండవని అంటారు. ఆ విశ్వాసంతోనే నిత్యం లక్షల మంది.. ప్రతి ఏటా కోటాను కోట్ల మంది మళ్లీ మళ్లీ దర్శించుకుంటూ ఉంటారు ఏడుకొండల స్వామిని. నిత్య కల్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న ఏడు కొండలపై.. అలిపిరి కాలి బాటలో మూడేళ్ల చిన్నారి కౌశిక్ ను.. పులి ఎత్తుకెళ్లటం.. క్షేమంగా దొరకటం అనేది అంతా అద్భుతంగా భావిస్తున్నారు. ఈ మాట మనం కాదు.. ఆ తల్లిదండ్రులే కాదు.. ప్రత్యక్ష సాక్షులు సైతం అనటం చూస్తుంటే.. కచ్చితంగా కొండపైన వెంకన్న స్వయంగా దిగి వచ్చి కాపాడారా అనే చర్చ జరగటం విశేషం..

ఏపీ రాష్ట్రం రాజోలుకు చెందిన కుటుంబం దేవుడి దర్శనానికి వచ్చింది. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ.. కొండ ఎక్కుతున్నారు. ఏడో మైలు రాయి దగ్గరకు రాగానే.. అక్కడే ఉన్న షాపుల దగ్గర విశ్రాంతి కోసం ఆగారు. అదే సమయంలో అడవిలో నుంచి పులి వచ్చింది. అక్కడే ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్ ను మెడ భాగంలో కరుచుకని.. అడవిలోకి లాక్కెళ్లింది. కళ్ల ముందు పులి.. పిల్లోడిని ఎత్తుకెళ్లటాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. భక్తులు, దుకాణదారులు.. అక్కడే ఉన్న కొంత మంది భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున కేకలు వేశారు. అయితే పులి పిల్లోడి మెడను కరుచుకుని.. అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. 

పులి వెళ్లిన మార్గంలోనే పరిగెత్తిన భక్తులు, ఇతర భద్రతా సిబ్బంది, వ్యాపారులు.. అడవిలో.. మెట్ల మార్గానికి 200 మీటర్ల దూరంలో పిల్లోడి ఏడుపు విన్నారు. రాత్రి సమయం కావటంతో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో వెళ్లి చూడగా.. బాలుడు స్పృహలోనే ఉండి.. ఏడుస్తూ ఉన్నాడు. చుట్టూ పులి కూడా లేకపోవటంతో పిల్లోడిని వెంటనే వెనక్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మూడేళ్ల చిన్నారి కౌశిక్ వేంకటేశ్వర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిటీ స్కాన్ చేయగా ఎలాంటి ఇబ్బంది లేదని.. పులి గాట్లు వల్ల మూడు కుట్లు పడ్డాయని.. ఆరోగ్యంగానే ఉన్నాడని ప్రకటించారు డాక్టర్లు. పూర్తిగా కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉంచి.. ఆ తర్వాత స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి.. ఇంటికి పంపిస్తామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. 

నిజంగా ఇది వేంకటేశ్వరస్వామి అద్భుతం అంటున్నారు చైర్మన్ సహా భక్తులు. చిన్నారిని ఎత్తుకెళ్లిన పులి 200 మీటర్ల దూరంలో ఏమీ చేయకుండా వదిలి వేయటం అనేది ఊహించని ఘటన.. పిల్లోడిని పులి కరుచుకుని వెళ్లిన తీరు చూస్తే.. అసలు చిన్నారి దొరుకుతాడా అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. ఎవరూ ఊహించని విధంగా 15 నిమిషాల్లోనే చిన్న గాయంతో.. 200 మీటర్ల దూరంలో చిన్నారి క్షేమంగా దొరకటం అంటే అద్భుతం కాకపోతే ఏంటీ.. అడవిలో పులికి అడ్డేలేదు.. చిన్నారి బరువు కూడా చాలా తక్కువ.. పులి మాత్రం పెద్దగానే ఉంది.. ఎంత దూరం అయినా తీసుకెళ్లగలదు.. ఇంకేమైనా చేయగలదు.. ఇక్కడ మాత్రం అలా జరగలేదు.. పిల్లోడిని వదిలేసి పులి వెళ్లిపోయింది.. ఇది నిజంగా వేంకటేశ్వరస్వామే రక్షించాడు అనేది పదే పదే చెబుతున్న మాటలు.. 

నిజంగా అద్భుతం కాకపోతే ఏంటీ.. కళ్ల ముందు పులి పట్టుకుంటే వదిలించుకోలేక ఎంత మంది చనిపోయారు.. అలాంటిది చిన్నారి ఎత్తుకెళ్లిన పులి.. ఏమీ చేయకుండానే వదిలి.. మళ్లీ అడవిలోకి వెళ్లిపోవటం అద్భుతమే కదా.. కొన్ని సార్లు నమ్మాలి.. నమ్మి తీరాలి డూడ్స్.. దేవుడు ఉన్నాడని.. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అంటున్నారు పెద్దలు.. పండితులు.. వెంకన్న భక్తులు..