అమ్రాబాద్ ఫారెస్ట్ లో పెరిగిన చిరుతలు

అమ్రాబాద్ ఫారెస్ట్ లో పెరిగిన చిరుతలు

అమ్రాబాద్, వెలుగు : చిరుత పులుల సంఖ్య రాష్ట్రంలో తగ్గగా, నాగర్​కర్నూల్​జిల్లాలోని అమ్రాబాద్​ టైగర్​రిజర్వ్(ఏటీఆర్)లో మాత్రం గణనీయంగా పెరిగింది. 2018 లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 334 చిరుతపులులు ఉండగా, 2022 నాటికి 297కు తగ్గాయి. అదే అమ్రాబాద్  టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 2018 లో 160 చిరుతపులులు ఉంటే 2022 నాటికి వాటి సంఖ్య 173కు చేరుకుంది. చిరుతలతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల వల్లే వాటి సంఖ్య పెరిగిందని డీఎఫ్ వో రోహిత్ గోపిడి తెలిపారు.

వన్య ప్రాణుల సంరక్షణ కోసం నిరంతర పర్యవేక్షణే కాకుండా అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం, గ్రాస్ ల్యాండ్స్ పెంపకం, తాగునీటి ఎద్దడి నివారణకు సోలార్ పంపులతో చెలిమలు, కుంటల ఏర్పాటు, సాసర్ పిట్ల డెవలప్​మెంట్ వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఏటీఆర్ లో త్వరలో ప్రొటెక్షనన్ వ్యాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి గాయపడిన వన్యప్రాణుల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి స్థానికులకు ఉపాధి కల్పించడమే కాకుండా, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తామని చెప్పారు.