
- లేట్ హర్ చైల్డ్ లేట్ హర్ షైన్’ పేరిట జిల్లాలో అవగాహన కార్యక్రమాలు
- రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్ గా సూర్యాపేట జిల్లాలో ప్రారంభం
- నాలుగు వారాలు, నాలుగు డిపార్ట్మెంట్లతో బాలికలకు శిక్షణ
సూర్యాపేట, వెలుగు: సమాజంలో బాలికలు అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ‘సమస్యలను అధిగమిద్దాం.. సాహాసంతో జీవిద్దాం’ అంటూ సూర్యాపేట జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్ గా బాలిక చైతన్యం పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నెలలో నాలుగు వారాలు నాలుగు శాఖలతో అవేర్‌నెస్ ప్రోగ్రాంలు చేపడుతున్నారు. సమాజంలో బాలికలకు చదువు ఒక్కటే కాకుండా వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
చదువుతో పాటు సమాజంపై అవగాహన
ప్రస్తుత సమాజంలో బాలికలపై లైంగిక దాడులు, చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు, ప్రేమ పేరిట మోసాల బారిన పడుతున్నారు. విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గత నెల 19 న ఒక్కో వారం ఒక్కో కాన్సెప్ట్ తో జిల్లాలోని గురుకులాలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని ఎలా ఎదుర్కొవాలో అన్న అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా టీచర్లకు వారం రోజుల పాటు శిక్షణ అందించి ఆ తర్వాత స్కూళ్లలో బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఫండ్స్ సైతం కేటాయిస్తున్నారు.
నాలుగు వారాలు నాలుగు డిపార్ట్మెంట్లు
జిల్లాలోని ఐసీడీఎస్, విద్యా, ఆరోగ్య, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్కూళ్లలో అవేర్‌నెస్ ప్రోగ్రాంలు చేపడుతున్నారు. ఒక్కో శాఖ ఒక్కో వారం ఒక్కో కాన్సెప్ట్ తో బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. మొదటి వారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోషకాహారం, బాలికల ఆరోగ్య సమస్యలపై, పీరియడ్స్ సమయంలో ఇబ్బందులను ఎలా అధిగమించాలి.. న్యూట్రిషన్ ఫుడ్ ఏం తీసుకోవాలి, హార్మోనల్ బ్యాలెన్స్ వాటిపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. రెండవ వారం పోలీస్ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు, సెల్ఫ్ డిఫెన్స్ , ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, ఆన్ లైన్ లో మోసపోకుండా ఎలా అడ్డుకోవాలి అనే వాటిపై శిక్షణ అందించనున్నారు. మూడవ వారం విద్యాశాఖ కెరీర్ గైడెన్స్ పై, నాలుగో వారం ఐసీడీస్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్మెంట్ పోక్సో చట్టాలు, సఖీ కేసులు, తల్లిదండ్రులు, గురువులను పట్ల గౌరవించడం లాంటి వాటిపై అవగాహన కల్పిస్తారు.
సమాజం పట్ల బాలికలకు అవగాహన పెంచేందుకే..
బాలికలకు చదువుతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండాలన్న ధ్యేయంతో బాలిక చైతన్యం కార్యక్రమం చేపట్టాం. అన్నీ స్కూళ్లలోని బాలికలకు ఒక్కో వారం ఒక్కో థీమ్, ఒక్కో కాన్సెప్ట్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమాజంలో బాలిక చదువుతోనే వారి భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుందన్న లక్ష్యంతో ఈ ప్రోగ్రాంలు చేపడుతున్నాం. - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్