ఆ ఊర్లో ఒక్కరికీ రైతుబంధు వస్తలె!

V6 Velugu Posted on May 31, 2021

మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురంలో
నాలుగేండ్లుగా వెయ్యి మంది రైతులకు పైసా ఇయ్యలే
ఈ ఏడాది కూడా వచ్చే పరిస్థితి లేదు
36 మంది చనిపోయినా పరిహారం అందలే
ఇప్పటిదాకా రూ.30 కోట్ల సంక్షేమ పథకాలు కోల్పోయిన్రు
కొంపముంచిన రికార్డుల ప్రక్షాళన.. 
న్యాయం చేయాలంటున్న రైతులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో చాలా మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందుతోంది. కానీ ఒక్క గ్రామంలో మాత్రం రైతు బంధు ఇవ్వడం లేదు. ఊరిలో ఉన్న వెయ్యి మంది రైతుల్లో ఏ ఒక్క రైతుకు కూడా నాలుగేళ్లుగా సాయం అందలేదు. ఈ యేడు వానాకాలం పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేదు. గతంలో 36 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయినా ఏ ఒక్క రైతు కుటుంబం రైతుబీమా రూ.5 లక్షల పరిహారానికి నోచుకోలేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఆ గ్రామ రైతాంగానికి శాపంగా మారింది. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామంలోని రైతుల గోస ఇది.
భూ రికార్డుల ప్రక్షాళనలో నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన వరకు ఏ సమస్యలు లేవు. అప్పట్లో చిన్న తండాలు, శివారుగా గ్రామాలుగా ఉన్న నారాయణపురం, పీకలతండా, క్యాంపు తండాలను మహబూబాబాద్‌‌‌‌ జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామం నుంచి వేరు చేసి కొత్త రెవిన్యూ విలేజ్‌‌‌‌గా మార్చారు. నారాయణపురం రెవెన్యూ విలేజ్‌‌‌‌గా మార్చి కేసముద్రం మండలంలో కలిపేశారు. దీంతో ఆ గ్రామ రైతుల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ గ్రామంలోని 1,827 ఎకరాల భూమిని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఫారెస్ట్‌‌‌‌ భూముల్లో కలిపేశారు. 1952కు ముందు ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి. అయితే 1952 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అటవీ శాఖ నుంచి భూములను వెనక్కు తీసుకుని రైతులకు పంపిణీ చేసింది. కానీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో తమ రికార్డుల్లో ఆయా సర్వే నంబర్లను మార్చలేదు. దీంతో అవి అటవీశాఖకు చెందిన సర్వే నంబర్లపైనే కొనసాగుతూ వచ్చాయి. దీంతో ఆ భూముల్లో 1,605 ఎకరాలు పట్టా ల్యాండ్‌‌‌‌ కవర్డ్‌‌‌‌ ఇన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌గా భూములుగా, మరో 222 ఎకరాలు పట్టాభూమిగా సర్కారు గుర్తించింది.
రైతులు పోరాడినా..
‘రెవెన్యూ భూములు ఫారెస్ట్‌‌‌‌ భూములెట్లయినయ్‌‌‌‌’అని రైతులకు అర్థంకాక లబోదిబోమన్నారు. 1962 రికార్డుల్లో పట్టాభూములుగా రిజిస్ట్రేషన్‌‌‌‌ అయినవి.. ఉన్న ఫలంగా ఫారెస్టు భూములుగా మారడంపై అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి గోడు వెల్లబోసుకున్నా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. గ్రామ భూ రికార్డులను తిరగదోడితే 1962లో పింగళి వెంకట్‌‌‌‌ రాంరెడ్డి వద్ద ఆ గ్రామ రైతులు కొన్నట్లు మహబూబాబాద్‌‌‌‌ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ కార్యాలయంలో రికార్డులు బయట పడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు స్థానిక నేత రవి ఆధ్వర్యంలో పలు మార్లు అటవీ శాఖ చీఫ్‌‌‌‌ కన్జర్వేటర్‌‌‌‌ ఆర్‌‌‌‌.శోభును, సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్‌‌‌‌ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఫిబ్రవరి 9న ఈ భూములన్నీ రెవెన్యూ భూములే అని తేల్చింది. వాటితో తమకు సంబంధం లేదని అటవీ శాఖ చీఫ్‌‌‌‌ కన్జర్వేటర్‌‌‌‌ ఉత్తర్వులు ఇచ్చారు.
రూ.9 కోట్ల రైతుబంధు అందలే
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల నేటికీ నారాయణపురం రైతులకు పట్టాదారు పాస్‌‌‌‌ పుస్తకాలు రాలేదు. ధరణి పోర్టల్లోనూ వివరాలు లేక, పాత పట్టా పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు ఉన్నా హక్కులు లేక సంక్షేమ పథకాలు దక్కలేదు. ఏదైనా అవసరం వచ్చి భూములు అమ్ముకునేందుకూ అవకాశం లేదు. ఐదేళ్లుగా రుణాలు పొందేందుకు అర్హత కోల్పోయారు. దీంతో నాలుగేళ్లుగా ఆ గ్రామంలోని రైతులకు ఏటా 1.82 కోట్ల చొప్పున రైతుబంధు రూ.7.3 కోట్లు రాలేదు. ఈ వానాకాలం మరో 1.82 కోట్లు వచ్చే పరిస్థితి లేదు. అంటే రూ.9.12 కోట్ల రైతుబంధు సాయం అందలేదు. రైతు బీమా ప్రారంభం నుంచి నేటి వరకు 36 మంది రైతులు చనిపోగా రూ.5 లక్షల పరిహారం అందక రూ.1.8 కోట్లు, రుణమాఫీ, ఇతర అంతా కలిపి దాదాపు రూ.30 కోట్ల సంక్షేమ ఫలాలు గ్రామంలోని వెయ్యి మంది రైతులకు దక్కకుండా పోయాయి.
ఇంటి పెద్ద చనిపోయి అనాథలమైనం
మాది పీకలతండా. నా భర్త గుగులోతు బిక్కు కరోనాతో చనిపోయిడు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారినం. కుటుంబ పోషణకు కష్టమయితాంది. రైతు బంధు, రైతు బీమా ఉంటే కుటుంబానికి ఆసరాగా ఉండేది. నా భర్త బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.50 వేలు ఆంధ్ర బ్యాంక్ నుంచి అప్పు తెచ్చిండు. అప్పు కట్టమని బ్యాంకు వాళ్లు ఒత్తిడి తెస్తే మళ్లా అప్పు చేసి కట్టిన. కానీ బ్యాంకు అధికారులు బంగారం తిరిగి ఇవ్వలేదు. నా భర్త పేరుతో లక్ష రూపాయల క్రాప్‌‌‌‌లోన్‌‌‌‌ ఉందని, అది కడితేనే ఇస్తామని అంటున్నరు.                          - గుగులోతు యాకమ్మ, పీక్లా తండా, నారాయణపురం.

Tagged Telangana, CM KCR, rythu bandhu, Village, crop, , Farmer\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'s

Latest Videos

Subscribe Now

More News