సేఫ్ గా కాలుద్దాం

సేఫ్ గా కాలుద్దాం

క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్త అవసరం
గ్రేటర్ పరిధిలోని 54 ఫైర్ స్టేషన్లలో
138 ఫైర్ మిస్ట్ బుల్లెట్లు సిద్ధం
హోల్ సేల్ రిటైల్ షాప్ లకు గైడ్ లైన్స్

హైదరాబాద్,వెలుగు: చిచ్చుబుడ్లు, రాకెట్లు, భూ చక్రాలు..ఇలా దీపావళి పండుగకి పటాకులు కాల్చితే వచ్చే ఎంజాయ్ మెంటే వేరు. కానీ పండుగ పూట పటాకులు కాల్చేవారు కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పటాకుల కాల్చేటప్పుడు ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర జాగ్రత్తలు అవసరం. పటాకులు కాల్చేటప్పుడు అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉండడంతో ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ అలర్ట్ అయ్యింది. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే క్రాకర్స్ కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ప్రతీ ఏటా దీపావళి నేపథ్యం లో సంభవిం చే అగ్నిప్రమాదాలతో ఫైర్ డిపార్ట్ మెంట్ ముందు జాగ్రత్తలు చేపట్టింది. హోల్‌‌‌‌‌‌‌‌ సేల్‌‌‌‌‌‌‌‌,రిటైల్ షాపులకు ఇప్పటికే నిర్థిష్టమైన గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇందులో టపకాయల దుకాణాలకు అనుమతులు ఇచ్చే దగ్గర్నుంచి టపాసుల నిల్వలకు తీసుకోవలసిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

అందుకోసం గ్రేటర్ పరిధిలో 54 ఫైర్ స్టేషన్లు,138 ఫైర్ మిస్ట్ బుల్లెట్లను సిద్దం చేసింది. ఇందులో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ప్రకారం హైదరాబాద్ లో 955,రంగారెడ్డి జిల్లాలో 1,104 క్రాకర్స్ షాపులకు అనుమతులు ఇచ్చారు. ప్రతీ క్రాకర్స్ షాపు వద్ద వాటర్ బక్కెట్స్ తో పాటు ఇసుక, ఫైర్ మిస్ట్ లు తప్పనిసరిగా అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు.

ఇలా చేద్దాం

పర్మిషన్ లేని దుకాణాల్లో పటాకులు కొనొద్దు. చిన్నారులు క్రాకర్స్ కాల్చేటప్పడు పెద్దలు వారి పక్కన ఉండాలి. పిల్లలు క్రాకర్స్ కి దూరంగా నిలబడి కాల్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కాటన్ బట్టలు వేసుకోవాలి. వాటర్ బకెట్ ని, బర్నాల్ ఆయిట్ మెంట్ ని దగ్గరగా ఉంచుకోవాలి. చేతులకు,కళ్ళకు మంటలు వ్యాపించకుండా గ్లౌస్ లు పొడవైన స్టిక్స్ వాడాలి. కొత్త రకం పటాకులు కొనేముందు వాటిని ఎలా కాలుస్తారో తెలుసుకోవాలి. భూ చక్రాలు కాల్చేటప్పుడు చెప్పులు వేసుకోవాలి. భారీ శబ్ధాలతో పేలే బాంబులు ఉంటే ఇంటికి, జనాలకు దూరంగా వాటిని పేల్చాలి. శబ్ధం ఎక్కువగా వచ్చే పటాకులను పేల్చేటప్పుడు పసిపిల్లలు, వయస్సు పై బడిన వారిని దూరంగా ఉంచాలి. పటాకులను చేతిలో పట్టుకుని కాల్చడం చేయొద్దు. వాటిని దూరంగా ఉంచి ఫైర్ స్టిక్స్ తో కాల్చాలి. పిల్లల చేతికి రాకెట్లు ఇవ్వకూడదు. వెలిగి పేలకుండా ఆగిపోయిన చిచ్చుబుడ్లు, రాకెట్లలాంటి పటాకుల దగ్గరికి వెళ్లి చెక్ చేయడం, వాటిని మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకూడదు.

చిచ్చుబుడ్లు కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని దూరం నుంచి కాలిస్తే మంచిది. రాకెట్లు కాల్చే సమయాల్లో పరిసర ప్రాంతాలను గమనించాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉండే పరిశ్రమలు, చెత్త డంపింగ్ యార్డులు దగ్గరగా లేకుం డా చూసుకోవాలి.
అగ్నిప్రమాదాలు సంభవిస్తే వెంటనే అదుపు చేసేందుకు నీటిని, ఇసుకను దగ్గరలో ఉంచాలి. క్రాకర్స్ షాపులు ఉన్న ప్రాంతాల్లో పటాకులు
కాల్చకూడదు. ఎలక్ట్రికల్ ఓవర్ హెడ్ లైన్స్ కింద రాకెట్, చిచ్చుబుడ్లు కాల్చకూడదు. గాయాలైతే చల్లని నీటిని పోస్తూ ఉండాలి. ఐస్
తో రుద్దడం, వెన్న, గ్రీజ్, పౌడర్ రాయడం చేయొద్దు. గాయపడితే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించాలి. ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే 101 ఫైర్ సర్వీసెస్ కి సమాచారం అందించాలి.

ఐ సేఫ్టీ కోసం ప్రొటెక్టివ్ గ్లాసెస్
– ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న విన్ విజన్ ఐ కేర్

దీపావళికి పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ శాతం డ్యామేజ్ కి గురయ్యేది కళ్లే. గతంలో దీపావళి మరుసటి రోజు కంటి సమస్యతో ఐ కేర్ హాస్పిటల్ కి వెళ్లిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు విన్ విజన్ ఐ కేర్ హాస్పిటల్ డిఫరెం ట్ ప్రొగ్రామ్ ను తీసుకొచ్చింది. కళ్లకు డ్యామేజ్ కాకుండా ఆపే ప్రొటెక్టివ్ గ్లాసెస్ ని సిటీ వ్యాప్తంగా విన్ విజన్ ఐ కేర్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కార్పొరేట్ సొషల్ రెస్పాన్సి బిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా విన్ విజన్ ఐ కేర్ హాస్పిటల్ గతేడాది దీపావళి నుంచి ఇలా ప్రొటెక్టివ్ గ్లాసెస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ముంబయి నుంచి ఐ ప్రొటెక్టివ్ గ్లాసెస్ ని తెప్పిస్తున్నట్టు విన్ విజన్ ఐ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ తెలిపారు. బేగంపేట, బంజారా హిల్స్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, ఏఎస్ రావు నగర్ ఇలా సిటీలో అతిపెద్ద క్రాకర్స్ మేళాలు జరిగే చోట ఓ స్టాల్ పెట్టి ఈ గ్లాసెస్ ని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఈ ఫ్రీ ప్రొటెక్టివ్ గ్లాస్సెస్ ను పండుగకు 2 రోజుల ముందు నుంచే పంపిణీ చేస్తున్నామన్నారు.