మీ పిల్లల బడులను బాగు చేయమనండి : ఆర్. వెంకట్ రెడ్డి

మీ పిల్లల బడులను బాగు చేయమనండి : ఆర్. వెంకట్ రెడ్డి

రాష్ట్రమంతా ఇప్పుడు మునుగోడు వైపే చూస్తున్నది. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వివిధ పార్టీలు అక్కడే ఉంటూ ఓట్ల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  తమను గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని హామీలు గుప్పిస్తున్న పార్టీలు.. విద్యా రంగ సమస్యలను మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. మునుగోడు ప్రజలు కూడా తమ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను బాగు చేయాలని ఎక్కడా నాయకులను ప్రశ్నించడం లేదు. రేపటి బాలల భవిష్యత్​కోసం ప్రజలు మీ ప్రాంతంలో తిరిగే నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక కమిటీ(సీఆర్​పీఎఫ్), తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులతో గత నెలలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి, మునుగోడు, మర్రిగూడ, నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల్లో విస్తృతంగా పర్యటించింది.  కేజీబీవీ, మోడల్ స్కూల్స్, కాలేజీ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలను సందర్శించి వాటి స్థితి గతులపై సామాజిక తనిఖీ నిర్వహించింది. నియోజకవర్గంలో దాదాపు 30 వేల మంది పిల్లలు చదువుతున్న స్కూల్స్, గురుకులాలు, హాస్టళ్లలో సరైన వసతులు లేవు, సరిపోను టీచర్లు, సిబ్బంది లేక స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రభుత్వ బడుల పరిస్థితి..

మునుగోడు నియోజక వర్గంలో ఉన్న 274 ప్రభుత్వ బడుల్లో దాదాపు 25 వేల మంది బాల బాలికలు చదువుకుంటున్నారు. టీచర్ల కొరత, విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం తదితర కారణాలతో కొన్ని మూతపడ్డాయి. ఇప్పుడు కొనసాగుతున్న చాలా ప్రభుత్వ బడులు కూడా పాతబడి, వర్షానికి ఉరుస్తున్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపడా లేవు. కట్టిన చోట నిర్వహణ సరిగా లేదు. ప్రభుత్వం స్కావెంజర్లను తీసివేసిన తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. తరగతి గదులు శుభ్ర పరిచేవారు లేక పిల్లలే ఊడ్చుకుంటున్నారు. మెజార్టీ పాఠశాలల్లో తాగు నీరు లేదు. ఒక్క మండలానికి కూడా రెగ్యులర్​ఎంఈవో లేరు. అందరూ అదనపు బాధ్యతలతో పని చేస్తున్న వారే. బడిలో ప్రతి టీచరుకు ఒక క్లాస్​రూమ్, కార్యాలయం, హెచ్ఎంకు రూమ్, బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, పిల్లలందరికీ సరిపోను రక్షిత నీటి వసతి, ప్రత్యేక వంట గది, ఆట స్థలం, కాంపౌండ్ వాల్ ఉండాలని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తున్నది. కానీ ఒక్క బడిలో కూడా ఈ చట్ట ప్రకారం వసతులు లేవని సామాజిక తనిఖీ ద్వారా తెలిసింది.

కేజీబీవీలదీ అదే దారి..

మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 కేజీబీవీల్లో 1368 మంది విద్యార్థులు చదువుతున్నారు. సామాజిక తనిఖీలో భాగంగా ప్రతి కేజీబీవీని సందర్శించినప్పుడు చాలా సమస్యలు బయటకొచ్చాయి. మునుగోడు కేజీబీవీలో ఇంటర్ తరగతులు ప్రారంభించటం వల్ల ఉన్న క్లాసు, డార్మెటరి రూమ్స్ సరిపోవడం లేదు. మరుగుదొడ్లు, బాత్ రూమ్ డోర్స్ ఊడిపోయాయి. 2018లో ఇంటర్ తరగతుల నిర్వహణ కోసం ప్రారంభించిన అదనపు బిల్డింగ్ నిర్మాణ పనులను బడ్జెట్ సరిపోక కాంట్రాక్టర్ ఆపేశారు. నారాయణపూర్ కేజీబీవీలో వర్షానికి డార్మెటరి గదులు ఉరుస్తున్నాయి. మర్రిగూడెం కేజీబీవీ గేట్ ముందు వర్షపు నీరు నిలిచింది. ప్రహరీ లేదు. చుట్టూ పొలాలు ఉండటంతో పురుగులు, దోమలు వస్తున్నాయి. ఆవరణ నుంచి హై టెన్షన్ కరెంట్ వైరు పోవడం ప్రమాదకరంగా ఉన్నది. నాంపల్లి కేజీబీవీ వెళ్లే మట్టి దారి వాన పడితే దారుణంగా మారుతుంది. సీసీ రోడ్డు వేయడంతోపాటు దారివెంట లైట్స్ పెట్టాలి. చౌటుప్పల్ కేజీబీవీలో ఇంటర్ వరకు ఉండటంతో క్లాసు రూమ్స్ సరిపోవడం లేదు. కూర్చోడానికి బెంచీలు లేక పిల్లలు కింద కూర్చుంటున్నారు. 

హాస్టళ్ల దుస్థితి..

మునుగోడు నియోజకవర్గంలో 9 ఎస్సీ, 3 బీసీ, 2 ఎస్టీ వెల్ఫేర్​హాస్టల్స్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు1100 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. కాగా ఈ14 హాస్టళ్లలో 3 అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మునుగోడు ఎస్సీ బాలుర హాస్టల్ ప్రభుత్వ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది. మునుగోడు బీసీ బాలికల హాస్టల్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. మునుగోడు బీసీ బాలురు హాస్టల్ ప్రైవేట్ భవనం కావడం వల్ల స్టూడెంట్స్​ఇబ్బంది పడుతున్నారు. మర్రిగూడెం ఎస్సీ, బీసీ బాలుర హాస్టళ్ల ప్రైవేట్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఒకే వార్డెన్ రెండు, మూడు హాస్టళ్లకు ఇన్​చార్జిగా ఉండటం వల్ల పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండటం లేదు. మర్రిగూడెం ఎస్టీ హాస్టల్ విద్యార్థులు బడికి కిలోమీటర్​పైగా దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు. 6 నుంచి పది తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్కూలులో పెట్టడం లేదు. వారు హాస్టల్ కి వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంది. నాంపల్లి ఎస్సీ బాలికల వసతి గృహానికి మహిళా సిబ్బంది లేక రాత్రి సమయంలో పిల్లలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని హాస్టల్స్ భవనాలు చాలా వరకు ఉరుస్తున్నాయి. వాటిల్లో మరుగుదొడ్లు రెగ్యులర్ గా శుభ్రం చేయడం లేదు. గత మూడేండ్ల నుంచి హాస్టళ్లకు ప్రభుత్వం పెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు సప్లయ్​చేయడం లేదు. అన్ని హాస్టల్స్ లో వాచ్ మెన్ లేరు, చాలాచోట్ల సిబ్బంది కొరత ఉంది. గదులకు, కిటికీలకు డోర్స్ లేవు.

గురుకులాల్లోనూ..

మునుగోడు నియోజకవర్గంలో 4 మోడల్ స్కూల్, కాలేజీలు ఉన్నాయి. వీటిలో 446 బాలికలు  చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు వసతి, భోజనం తప్ప ఏమీ అందటం లేదు. ఒక్కో చోట 100 మంది విద్యార్థులకు నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. స్వీపర్, స్కావెంజర్ లేరు. గతంలో ప్రతి విద్యార్థికి ప్రత్యేక కిట్, కాస్మొటిక్స్ ఛార్జీలు ఇచ్చేది ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇంటర్ విద్యార్థులకు బుక్స్​రాలేదు. దుప్పట్లు, బెడ్ షీట్స్, పెట్టెలు, ప్లేట్లు లేవు. లైబ్రరి బుక్స్, మ్యాప్స్, గ్లోబ్స్​ సప్లయ్స్​ చేయాలి. బాలుర మైనార్టీ గురుకుల విద్యాలయం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇందులో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇరుకు గదుల్లో క్లాసు రూమ్స్ నడుస్తున్నాయి. బాత్ రూమ్స్, టాయిలెట్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. చౌటుప్పల్ గురుకుల బాలికల పాఠశాలలో 642 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రెండు గదులు శిథిలావస్థలో ఉన్నాయి. ఇంటర్ వారికి బుక్స్​రాలేదు. ఇక్కడ18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి స్థానంలో తాత్కాలిక స్టాఫ్​ఏర్పాటు చేశారు. పాఠశాలలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ప్రహరీ గోడ ఎత్తు పెంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. 3 తరగతుల విద్యార్థులకు మంచాలు లేక కిందనే పడుకుంటున్నారు. ఇక్కడ టాయిలెట్స్ రిపేర్ ఉన్నవి. చాలా వరకు గురుకులాలు ప్రైవేటు అద్దె భవనాల్లో లక్షల రూపాయల కిరాయిలకు కొనసాగుతున్నాయి. వాటిల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మునుగోడు ప్రజలకు మేలు చేయాలనుకుంటున్న పార్టీలు ఈ నియోజకవర్గంలో అధ్వాన స్థితిలో ఉన్న బడులను, హాస్టళ్లను బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను బాగు చేసుకునేందుకు నాయకుల వద్ద నుంచి స్పష్టమైన హామీ తీసుకొని ఓట్లు వేయండి. అవసరమైన మేరకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు కృషి చేయమని కోరండి.

బుక్స్​, యూనిఫామ్​ రాలేదు..

పాఠశాల స్థాయిలో బుక్స్​పూర్తిగా రాలేదు. ఇంటర్ పుస్తకాలు సప్లయ్ చేయలేదు. పూర్తి స్థాయిలో యూనిఫామ్​ ఇవ్వలేదు. నోట్ బుక్స్, పెట్టెలు, ప్లేట్లు, దుప్పట్లు, బెడ్ షీట్స్ ఇవ్వడం లేదు. గతంలో ప్రభుత్వం 14 రకాల వస్తువులతో ఇచ్చే కిట్​ఇప్పుడు బాలికలకు అందడం లేదు. అర్ధరాత్రి పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. అత్యవసర పరిస్థితిలో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. 2018లో పెంచిన మెనూ చార్జీలు ప్రస్తుత ధరలకు సరిపోవడం లేదు. కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసినా.. అన్నిచోట్లా రిపేర్ లో ఉన్నవి. టీచర్సే షిప్ట్ ల వారీగా వార్డెన్ బాధ్యతలు నిర్వహించడం వల్ల సబ్జెక్టుకు న్యాయం చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినందున ఇంగ్లీష్, హిందీ లైబ్రరీ బుక్స్ సప్లై చేయాలి. బెడ్స్​లేక పిల్లలు కింద పడుకుంటున్నారు. షూ, టై, బెల్టు, ఐడీ కార్డులు కావాలని పిల్లలు కోరుతున్నారు. 

- ఆర్. వెంకట్ రెడ్డి, జాతీయ కన్వీనర్, ఎం.వి ఫౌండేషన్