చిన్నారుల బంగారు భవిష్యత్​కు బాటలు వేయండిలా...

చిన్నారుల బంగారు భవిష్యత్​కు బాటలు వేయండిలా...

వెలుగు బిజినెస్​డెస్క్​: తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ అవకాశాలను అందించాలని కోరుకుంటారు. ముఖ్యం గా ప్రపంచ స్థాయి చదువును అందించి,  మరపురాని విధంగా పెళ్లి చేయాలని ఆశిస్తారు. అయితే, ద్రవ్యోల్బణం రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  4 శాతం లక్ష్యాన్ని అధిగమించడంతో ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.  ఈ అడ్డంకులను అధిగమించడానికి విద్య,  పెళ్లిళ్ల వంటి పెద్ద ఖర్చుల కోసం డబ్బు సంపాదించడానికి తల్లిదండ్రులు  దీర్ఘకాలిక ఫైనాన్షియల్​ ప్లాన్లను తయారు చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు పరిగణించవలసిన ఐదు కీలక అంశాలు ఇవి.

ఖర్చుల అంచనా:

చదువు ఖర్చులు ఏటా దాదాపు 12 శాతం పెరుగుతాయని బ్యాంక్‌‌‌‌‌‌‌‌బజార్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (కమ్యూనికేషన్స్) ఏఆర్​ హేమంత్ చెప్పారు. తల్లిదండ్రులు భవిష్యత్తు ఖర్చులను కచ్చితంగా అంచనా వేయాలి.

ఉదాహరణకు,  ప్రస్తుతం చదువుకు రూ.లక్ష కేటాయిస్తే ఆరేళ్లలో రూ.2 లక్షలకు పెరగవచ్చు.  పెట్టడానికి సరైన మొత్తాన్ని నిర్ణయించడంలో ఈ దూరదృష్టి పెట్టుబడి సహాయపడుతుంది. ఎంచుకున్న పెట్టుబడి ప్రణాళికపై సరైన రాబడిని అందిస్తుంది.

ఆర్థిక క్రమశిక్షణ : ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం విజయవంతమైన దీర్ఘకాలిక ప్రణాళికకు చాలా ముఖ్యం. నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి పురోగతిని పరిశీలించడం, బడ్జెట్‌‌‌‌‌‌‌‌లను రూపొందించడం,  అత్యవసర నిధులతో సహా పొదుపులను ఏర్పాటు చేయడం వంటివి ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడానికి కీలకం.

ఇన్వెస్ట్​మెంట్స్​ డైవర్సిఫికేషన్​: దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను మరింత డైవర్సిఫై చేయడానికి,  మొత్తం ఆర్థిక వ్యూహాన్ని మెరుగుపరచడానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లను,  రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలి.  

ప్రారంభ పెట్టుబడి: ముందుగా పెట్టుబడులు ప్రారంభించడం చాలా ముఖ్యం. ఫలితంగా మెరుగైన రేట్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు.  పిల్లల భవిష్యత్తు కోసం వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులను ఆలస్యం చేయడం వల్ల లాభదాయకమైన వెంచర్ల కోసం ఎక్కువ డబ్బు పెట్టాల్సి రావొచ్చు. ముందస్తు పెట్టుబడి తెలివైన నిర్ణయం.

సరైన పెట్టుబడిని ఎంచుకోవడం : దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌లను ఎంచుకోవడం మంచి నిర్ణయం. ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌లు వివిధ పరిశ్రమ రంగాలలో, వివిధ రకాల స్టాక్‌‌‌‌‌‌‌‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్కును చాలా వరకు తగ్గిస్తాయి.  సమతుల్యమైన,  లాభదాయకమైన పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోకు భరోసా ఇస్తాయి.