
రాష్ట్రంలో 4 చోట్ల పంచాయతీ రాజ్ సమ్మేళనాలు
కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు, గ్రామాల వికాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఈ సమ్మేళనాలు నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.
సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, జడ్పీ చైర్ పర్సన్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఇఓపిఆర్డీలు, ఎంపిడివోలు, డిఎల్పీవోలు, సిఇవోలను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తామన్నారు ముఖ్యమంత్రి. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంలోకూడా సమ్మేళనాలలో చర్చిస్తామన్నారు. సమ్మేళనాల తరువాత అధికారులతో 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేస్తామని, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతామన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామాల్లో మూడు నెలల్లోనే మార్పు
గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు సీఎం కేసీఆర్. ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్ లో కలెక్టర్లకు అవగాహన సదస్సు ఏర్పాటుచేస్తామన్నారు.