స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిద్దాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిద్దాం

జూబ్లీహిల్స్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో మాలల పాత్ర మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్ డ్​లోక్​సభ నియోజకవర్గాల్లో  బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకుండా మాల మహానాడు కృషి చేసిందని గుర్తుచేశారు. శనివారం బంజారాహిల్స్ లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి, కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న నేతలను తిరిగి రాజ్యాంగమే మనకి రక్ష అనేలా చేయగలిగామని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా దళితులు బీజేపీని నమ్మలేదని, దేశవ్యాప్తంగా రిజర్వుడు నియోజకవర్గాల్లో  విపక్ష పార్టీలే విజయం సాధించాయని చెన్నయ్య పేర్కొన్నారు. సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్, మన్నె శ్రీధర్ రావు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాలుక రాజేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు  బైండ్ల శ్రీనివాస్, నాయకులు గోకుల కల్యాణ్, కనకం ఎల్లస్వామి, గోవిందు, కమల్ ఆదర్శ్, కృష్ణ అనిల్, రాకేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.