
ఉపాధి కోసం సౌదికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన పలువురు తెలంగాణవాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సొంత ఊళ్లలో ఉపాధి లేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మంది సౌదిలోని కంపెనీలో కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కంపెనీ యాజమాన్యం మారడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. జీతాలు లేక, అక్కడ గదుల్లో ఉండలేక నరకయాతన అనుభవించారు. చివరికి స్వస్థలాలకు చేరుకోవాలన్నా అక్కడ కంపెనీ సహకారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి ఇబ్బందులుపై ‘వెలుగు’లో కథనాలు రావడంతో స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఎంబసీపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సౌదిలో ఉన్న ఎంబసీ అధికారులు కార్మికుల సమస్యలను సౌది ప్రభుత్వానికి నివేదించారు.
దీంతో ఇప్పటివరకు 550 మంది స్వస్థలాలకు చేరుకోగా, మరో 50 మంది అక్కడి అకామా(రెసిడెన్స్పర్మిట్) లేక రాలేకపోయారు. దీనిపై కథనాలు ప్రచురించడంతో సౌదీ ప్రభుత్వం అకామా రెన్యువల్చేసి వారంలోగా వారంతా స్వస్థలాలకు చేరేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇండియన్ ఎంబసీ ఆఫీసర్లు కార్మికులను వారంలోగా స్వదేశానికి పంపిస్తున్నట్లు ట్విట్టర్‍లో పోస్టు చేశారు.